నెల్లూరు జాఫర్ సాహెబ్ కాలువలో రెండు మృత దేహాలు...

ఠాగూర్

బుధవారం, 8 అక్టోబరు 2025 (10:21 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరులో జంట హత్యలు జరిగాయి. ఈ రెండు మృతదేహాలను పెన్నా బ్యారేజీకి సమీపంలోని జాఫర్ సాహెబ్ కాలువలో స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ జంట మృతదేహాలు స్థానికంగా సంచలనంగా మారింది. మృతులు చేపల వేటపై ఆధారపడి జీవించే సంచార జీవులుగా పోలీసులు గుర్తించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మంగళవారం ఉదయం తిక్కన పార్కు ఎదురుగా రక్తపు మరకలు ఉన్నాయని, జాఫర్ సాహెబ్ కాలువలో ఒక మృతదేహం తేలియాడుతోందని సంతపేట పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ దశరథ రామారావు, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలువలోని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలిస్తుండగా, దానికి వంద మీటర్ల దూరంలోనే మరో మృతదేహం ఉన్నట్లు గుర్తించి వెలికితీశారు.
 
పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో మృతుల్లో ఒకరిని బాపట్ల ప్రాంతానికి చెందిన ఎం.పోలయ్యగా నిర్ధారించారు. పోలయ్య తన రెండో భార్య లక్ష్మితో కలిసి పెన్నా నది ఒడ్డున ఓ చిన్న గుడారంలో నివసిస్తున్నాడు. మరో మృతుడిని శివగా గుర్తించారు. ఇద్దరూ చేపలు పట్టుకుని జీవించే నిరుపేద సంచార జీవులని తెలిసింది.
 
అయితే, కేవలం చేపల వేటపై బతికే వీరిని ఇంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్యల వెనుక గంజాయి బ్యాచ్ హస్తం ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నది పరిసరాల్లో గంజాయి తాగే కొందరు వ్యక్తులు, మత్తులో వీరిపై దాడి చేసి హత్య చేసి ఉంటారని చెబుతున్నారు.
 
ఈ ఘటనలో ఐదుగురికి పైగా పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, నేరం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా పనిచేయకపోవడం దర్యాప్తుకు అడ్డంకిగా మారింది. ఈ జంట హత్యల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు