నెల్లూరు జిల్లాలో వైకాపా మూకలు మరోమారు రెచ్చిపోయారు. పెన్నా నది నుంచి రాత్రి సమయాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారాన్ని చేరవేసినందుకుగాను ఇద్దరు యువకులను పట్టుకుని కాళ్ళు చేతులు విరగ్గొట్టి చావబాదారు. ఆదివారం రాత్రి రోడ్డు పక్కన ఉండగా వైకాపా నేతలు వారిని పట్టుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కోవూరు నియోజకవర్గం మినగల్లులో జరిగిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.
బాధితులు వెల్లడించిన వివరాల మేరకు.. బుచ్చి మండలం మినగల్లు దళితవాడకు చెందిన శ్రీకాంత్, చింతల రమేశ్ అనే ఇద్దరు యువకులు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. వారు ఆదివారం రాత్రి రోడ్డు పక్కన ఉండగా.. అదే ప్రాంతానికి చెందిన వైకాపా సానుభూతిపరులు మూకుమ్మడిగా దాడి చేశారు. శ్రీకాంత్ రెండుకాళ్లు విరిచేసి తలపై బలంగా కొట్టారు.
మరో యువకుడు చింతల రమేశ్‌ను వెంబడించడంతో పారిపోయారు. సమీపంలోని శ్మశానం వద్ద రమేశ్ చొక్కా కనిపించగా ఇప్పటికీ అతని ఆచూకీ లభ్యం కాలేదు. శ్రీకాంత్ నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు.. రామ్మోహన్, అఖిల్, కౌషిక్, ఆశిష్, నారయ్యలపై ఏఎస్ఐ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.