కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

ఠాగూర్

మంగళవారం, 21 అక్టోబరు 2025 (16:03 IST)
తమ ఇంటి కోడలితో మాజీ డీజీపీ అయిన మామ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు, ఈ విషయం తెలిసిన కుమారుడు అనుమానాస్పదంగా మృతి చెందడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఆ మాజీ డీజీపీ పేరు మొహ్మద్ ముస్తాపా. పంజాబ్ రాష్ట్ర మాజీ డీజీపీ. ఈయన కుమారుడు అఖిల్ అఖ్తర్ ఇటీవల అనుమానాస్పదంగా చనిపోయాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తన భార్యతో తండ్రికి సన్నిహిత సంబంధం ఉందంటూ మరణానికి ముందు అఖిల్ సంచలన ఆరోపణలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు రావడంతో ఈ కేసు చర్చనీయాంశమైంది. దీంతో పోలీసులు మృతుడి కుటుంబసభ్యులపై హత్య అభియోగాలు మోపారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, 33 ఏళ్ల అఖీల్ అఖ్తర్ అక్టోబరు 16న పంచకులలోని తన ఇంట్లో స్పృహ కోల్పోయి కన్పించాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. డ్రగ్ ఓవర్ డోస్ కారణంగానే తమ కుమారుడు మరణించినట్లు అఖీల్ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో అనారోగ్య సమస్యలతో మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. అఖిల్ తండ్రి ముస్తాఫా మాజీ డీజీపీ. తల్లి రజియా సుల్తానా మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు.
 
కాగా.. అఖీల్ మరణించిన కొద్ది రోజుల తర్వాత అతడి స్నేహితుడు ఒకరు పోలీసులను ఆశ్రయించారు. అతడిని హత్య చేసి ఉంటారని ఆరోపించారు. అదే సమయంలో ఆగస్టు 27న అఖీల్ రికార్డు చేసిన ఓ వీడియో బయటకు రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. అందులో మాజీ డీజీపీపై మృతుడు సంచలన ఆరోపణలు చేశాడు. 
 
'నా భార్యకు నా తండ్రితో సన్నిహిత సంబంధం ఉంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను మానసికంగా కుంగిపోయా. ఈ సంబంధం గురించి మా ఇంట్లో అందరికీ తెలుసు. వాళ్లు నన్ను పిచ్చోడిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తప్పుడు కేసులో ఇరికించడమో లేదా చంపేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కుట్రలో నా తండ్రితో పాటు తల్లి, సోదరి కూడా భాగస్వాములే' అని అఖిల్ ఆ వీడియోలో ఆరోపించాడు. దీంతో ఈ వీడియో ఆధారంగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు