కుటుంబ గొడవలు... మనస్తాపంతో కుమారుడిని చంపేసి.. ఆపై బలవన్మరణం

ఆదివారం, 27 ఆగస్టు 2023 (12:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఎలిగేడు మండలం రాములపల్లిలో ఓ విషాదకర ఘటన జరిగింది. కుటుంబ గొడవలతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తన 17 యేళ్ల కుమారుడిని చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు... 
 
రాములపల్లికి చెందిన కల్వల తిరుపతిరెడ్డి (30)కి భార్య మానస, కొడుకు దేవా (17 నెలలు) ఉన్నారు. కొన్నేళ్లుగా తిరుపతి రెడ్డికి సోదరుడు రత్నాకర్ రెడ్డికి మధ్య భూవివాదం నెలకొంది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. భూ సమస్య పరిష్కారం కాకపోగా రత్నాకర్ రెడ్డి బంధువులు తిరుపతి రెడ్డిని, అతడి కుమారుడిని చంపేస్తామని పలుమార్లు బెదిరించారు. 
 
ఈ నేపథ్యంలో తిరుపతి రెడ్డి దాదాపు యేడాది కాలంగా కుటుంబంతో సుల్తానాబాద్‌లో ఉంటున్నాడు. శుక్రవారం వరలక్ష్మీ పూజ కోసం భార్యా కొడుకుతో కలిసి స్వగ్రామంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తిరిగి వచ్చాడు. శనివారం మరోసారి కొడుకు దేవాన్‌ను తీసుకొని స్వగ్రామానికి వెళ్లాడు. నేరుగా పొలం వద్దకు వెళ్లి చిన్నారిని బావిలో తోసి, వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు.
 
స్వగ్రామం వెళ్లిన భర్త, కొడుకు మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో మానస మామ (భర్త తండ్రి) సంజీవ రెడ్డికి ఫోన్ చేసింది. ఇంటికి రాలేదని చెప్పిన ఆయన పొలం వద్దకు వెళ్లి చూడగా బావి ఒడ్డుపై తిరుపతి రెడ్డి అపస్మారక స్థితిలో పడి ఉండటం కనిపించింది. మనవడి కోసం గాలిస్తూ అనుమానంతో బావిలో చూడగా నీళ్లపై చెప్పులు తేలి ఉండటంతో గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. 
 
అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలోని నీటిని మోటార్లతో తోడి చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. తిరుపతి రెడ్డిని మొదట సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తిరుపతి రెడ్డి భార్య మానస ఫిర్యాదు మేరకు రత్నాకర్ రెడ్డి, అతడి మామ సత్తిరెడ్డి, బావమరిది లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు