తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శనివారం మధ్యాహ్న సమయంలో బాధితురాలు తన సోదరి ఇంటికి తెలిసిన యువకుడితో బయలుదేరింది. మార్గమధ్యంలో బంత్రా ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ సమీపంలోని మామిడి తోట వద్ద ఆగారు. అదేసమయంలో అక్కడికి చేరుకున్న వ్యక్తులు, బాలికతో ఉన్న వ్యక్తిని చితకబాది, ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు.
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గత రాత్రి హరౌనీ రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు చేస్తుండగా బైకుపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపేందుకు ప్రయత్నించగా, వారు ఆపకుండా వేగంగా దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పైగా, పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు వారిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ నిందితుడి కాలికి బుల్లెట్ తగలడంతో కుప్పకూలిపోయాడు.
గాయపడిన నిందితుడుని లలిత్ కశ్యప్‌గా గుర్తించి, అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న మరో నిందితుడు మీరజ్ (20)ను రైల్వే స్టేషన్ సమీపంలోనే అరెస్టు చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన మిగిలిన నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితుల నుంచి ఒక బైకు, నాటు తుపాకీ, మొబైల్ ఫోనును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.