కొంతమంది అప్పుల బాధతో, భయంతో, అవమానభారంతో ప్రాణాలను తీసుకుంటుంటారు. కానీ ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు కదా. ఐతే అవన్నీ ఆ క్షణంలో పట్టించుకోని కొందరు బలవన్మరణానికి పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటన పంచకులలో జరిగింది. హర్యానాలోని పంచకుల సెక్టార్ 27కి సమీపంలో ఓ ఇంటికి దగ్గరగా కారు పార్క్ చేసి వుంది. ఆ కారును చూసిన స్థానికుడు అనుమానంతో అక్కడికి వెళ్లి చూసాడు. కారు డోర్ అద్దాలు కండువాలతో కప్పి వున్నాయి. డ్రైవర్ సీటు వైపుకి వెళ్లి డోర్ తీయగా అందులో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతతో వున్నట్లు కనిపించాడు. దాంతో... ఈ కారును ఇక్కడెందుకు ఆపారు, వేరే ఎక్కడైనా పార్క్ చేసుకోండి అంటూ చెప్పాడు.
డ్రైవింగ్ సీట్లో వున్న వ్యక్తి, కారు ఇంజిన్ స్టార్ట్ చేసాడు కానీ నడపలేని స్థితిలో వేలాడుతున్నాడు. అతడి స్థితి చూసి అనుమానం వచ్చిన స్థానికుడు, కారు నుంచి కిందకు దిగమని అతడిని కోరాడు. దాంతో అతడు డ్రైవింగ్ సీట్లో నుంచి కిందకి దిగి... కారులో వున్నవారంతా నా కుటుంబ సభ్యులే. అందరూ విషం తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. బ్యాంకులో అప్పులు తీర్చలేక చనిపోయారు. మా బంధువులంతా బాగా ధనవంతులే. కానీ ఎవ్వరూ సాయం చేయలేదు. అందుకే ఇక చనిపోదామని నిర్ణయించుకున్నాము.
మరో 5 నిమిషాల్లో నేను కూడా చనిపోతా అంటూ చెప్పిన కొన్ని నిమిషాలకే అతడు నేలపై పడి అపస్మారకంలోకి వెళ్లిపోయాడు, కారులో వున్నవారిని పరిశీలించిన స్థానికుడికి వారంతా నురగలు కక్కి పడి వుండటాన్ని గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు 5 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అంబులెన్స్ రావడానికి మాత్రం అర్థగంటకు పైగానే పట్టింది. ఈలోపు అపస్మారకంలోకి వెళ్లిపోయిన వ్యక్తి కూడా చనిపోయాడు అంటూ చెప్పాడు స్థానికుడు.
ఆత్మహత్య చేసుకున్నవారంతా డెహ్రడూన్‌కి చెందినవారుగా గుర్తించారు. కారులో సూసైడ్ నోట్ కూడా లభించింది. 42 ఏళ్ల ప్రవీణ్ మిట్టల్, అతడి భార్య ముగ్గురు పిల్లలు, అతడి తల్లిదండ్రులతో సహా మొత్తం ఏడుగురు విషాన్ని తీసుకుని చనిపోయారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.