అదృశ్య శక్తుల వశం పేరుతో నగదు ఆశ చూపి కొందరు వ్యక్తులు యువతులతో నగ్న పూజలు చేయించారు. ఇందుకోసం ఓ నకిలీ పూజారికి కొందరు బ్రోకర్లు, బ్యూటీపార్లర్ మహిళ సహకరించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
నగ్నంగా తాంత్రిక పూజలు చేయడం ద్వారా అదృశ్యశక్తులు వశమవుతాయని, తద్వారా లక్షలాది రూపాయలు సంపాదించవచ్చని అమాయక యువతులకు ఓ నకిలీ పూజారి ఆశ కల్పించాడు. అతని మాటలు నిజమేనని నమ్మిన కొందరు అమ్మాయిలు నగ్నపూజలకు సమ్మతించారు.
గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నెకల్లు గ్రామానికి చెందిన నాగేశ్వర రావు అనే నకిలీ పూజారి తాంత్రిక పూజలు చేస్తుంటారు. తనకు పరిచయమైన చిలకలూరిపేటకు చెందిన ఓ బ్యూటీపార్లర్ నిర్వాహకురాలు అరవిందను సంప్రదించి తాంత్రిక పూజలతో అదృశ్యశక్తులను వశపరుచుకుని లక్ష్మీ కటాక్షం పొందవచ్చని చెప్పాడు.
దీంతో అరవింద ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన పలువురు బ్రోకర్లను సంప్రదించి, యువతులు కావాలని కోరింది. దీంతో ఓ ముఠా ఆత్మకూరుకు చెందిన డిగ్రీ చదువుతున్న ఓ యువతి (19)ని, ప్రైవేటు ఉద్యోగం చేసే మరో యువతి(20)ని తీసుకొచ్చి అరవిందకు అప్పగించారు.
గత సోమవారం ఇరువురు యువతులను పొన్నెకల్లులో నాగేశ్వరరావుకు అప్పగించారు. ఆయన రెంండు రోజుల పాటు యువతులను నగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేసి తర్వాత చిలకలూరిపేట అరవింద ఇంటికి మకాం మార్చాడు. అక్కడ కూడా యువతులతో నగ్నంగా పూజలు చేయించాడు. కానీ, పూజలు సఫలం కాలేదని, మరింత నిష్టంగా తాంత్రిక పూజలు చేయాలని చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలో తిరిగి పొన్నెకల్లుకు తీసుకెళుతుండగా, తాము మోసపోయామని గ్రహించిన యువతులు.. నకిలీ పూజారికి ఎదురుతిరిగారు. దీంతో బ్రోకర్ల ముఠా వారిని బెదిరించి దౌర్జన్యానికి దిగింది. ఈ క్రమంలో ఆయా యువతులు తమ స్నేహితులకు సమాచారం ఇచ్చి దిశ ఫోన్ నంబరు 112కు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన దిశ పోలీసులు.. నల్లపాడు వద్ద వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
పరారీలో ఉన్న నకిలీ పూజరీ నాగేశ్వర రావును కూడా శనివారం రాత్రి అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారులుగా ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. పైగా, నగ్నపూజల పేరుతో ఆ ఇద్దరు యువతులపై నకిలీ పూజారి అత్యాచారం చేసినట్టు సమాచారం. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.