గత కొన్ని రోజులుగా బీహార్‌లోని నవాడాలో పిల్లలు లేని స్త్రీలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 13 లక్షలు అంటూ ప్రకటనలు కనబడ్డాయి. దీనితో ఎంతో ఆసక్తిగా ఆ ప్రకటన కింద వున్న ఫోన్ నంబర్‌ను చాలామంది సంప్రదించారు. ఫోన్ చేస్తే స్పందించిన అవతలి వ్యక్తులు పిల్లలు లేని స్త్రీలకు మీరు గర్భం వచ్చేట్లు చేయండి. అందుకు ప్రతిఫలంగా మీకు రూ. 5 లక్షల నుంచి రూ. 13 లక్షల వరకూ అందుతాయి అని నమ్మించారు. దీనితో చాలామంది అత్యాశకు పోయి వారి ప్రకటనలను విశ్వసిస్తూ రిజిస్ట్రేషన్ అయ్యారు కూడా.
ఐతే రిజిస్ట్రేషన్ పేరుతో వ్యక్తి నుంచి రూ. 5 వేల నుంచి 20 వేల వరకూ ఒక్కొక్కరి నుంచి వీరు రాబట్టారు. ఆ తర్వాత మేము గర్భం చేయాల్సిన మహిళలు ఎక్కడున్నారు అడిగిన తర్వాత ఫోన్ స్విచాఫ్ వచ్చేస్తుంది. ఇక ఎంత ప్రయత్నించినా స్పందన వుండదు. దీనితో తాము మోసపోయామని రిజిస్ట్రేషన్ చేసుకున్న పురుషులు తెలుసుకున్నారు. ఇలాంటి మోసాల కేసులు పోలీసుల దృష్టికి రావడంతో దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. చివరకు ఈ ముఠాను పోలీసులు గుర్తించారు. నార్డిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కహురా గ్రామంలో దాడి చేసి ముగ్గురు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు.
పోలీసులకు చిక్కిన ఈ సైబర్ నేరగాళ్లు ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్, ప్లే బాయ్ సర్వీస్ పేరుతో ప్రజలకు ఫోన్ చేసి మోసం చేస్తున్నారు. మోసగాళ్ల అరెస్ట్ తర్వాత, నిందితులు ఎంతమందిని మోసం చేశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తమ్మీద కొంతమంది మగవారి బలహీనతలను ఆసరా చేసుకుని వీరు లక్షలకు లక్షలు డబ్బు సంపాదించినట్లు తేలింది.