బస్సులో టీనేజ్ బాలికపై ఐదుగురు వ్యక్తుల అఘాయిత్యం!

ఠాగూర్

సోమవారం, 19 ఆగస్టు 2024 (16:01 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో టీనేజ్ బాలికపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఈ నెల 12వ తేదీన చోటుచేసుకోగా, ఈ దారుణంపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించి దారుణం చోటుచేసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వ బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ బస్సు డ్రైవర్లు, కండక్టర్ ఉండడం గమనార్హం. 
 
ఈ నెల 12వ తేదీ అర్థరాత్రి సమయంలో అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ 12వ నంబరు ఫ్లాట్‌ఫాంపై ఓ బాలిక ఒంటరిగా కూర్చుని ఉందంటూ జిల్లా శిశు సంక్షేమ కమిటీకి సమాచారం వచ్చింది. ఆ వెంటనే కమిటీ సభ్యులు బాలికను బాలనికేతనకు తరలించారు. అక్కడ కౌన్సెలింగ్ ఇవ్వగా బాలిక జరిగిన సంగతిని వివరించింది. దీంతో శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలు ప్రతిభా జోషి శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ సింగ్ బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. తనది పంజాబ్ రాష్ట్రమని, తానొక అనాథనని తొలుత బాధితురాలు చెప్పిందని ఆయన వెల్లడించారు. అనంతరం తనది ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ అని చెప్పిందన్నారు. బాలిక మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి డెహ్రాడూన్‌కు వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 
 
ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్సు డెహ్రాడూన్‌కు చేరుకున్న తర్వాత ప్రయాణికులంతా దిగిపోయాక తొలుత డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యానికి పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అజయ్ సింగ్ చెప్పారు. అనంతరం పక్కనే నిలిపి ఉంచిన బస్సులోని ఇద్దరు డ్రైవర్లు, ఆ తర్వాత బస్టాండ్‌లోని క్యాషియర్ కూడా అకృత్యానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. వీరందరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు