బండి సంజయ్‌కు ఉద్వాసన తప్పదా? తప్పిస్తే కష్టమంటున్న శ్రేణులు!

మంగళవారం, 13 జూన్ 2023 (12:57 IST)
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఉద్వాసన తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే మాత్రం బీజేపీ శ్రేణులు డీలాపడిపోతాయని నేతలు అంటున్నారు. పైగా, ఆయనకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఇదేవిషయాన్ని బీజేపీ పెద్దలకు కూడా సీనియర్ నేతలు చేరవేశారు. అందువల్ల త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు బండి సంజయ్‌తో అధ్యక్షుడిగా కొనసాగించాలని పట్టుబడుతున్నారు. 
 
రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న సంజయ్‌ను తొలగించి డీకే అరుణ లేదా ఈటల రాజేందర్‌కు ప్రాధాన్యం కల్పించే అంశాన్ని పార్టీ అధినాయకత్వం పరిశీలిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీని సమర్థంగా నడిపిస్తున్న సంజయ్‌ను తప్పించి, మరొకరికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని రాష్ట్ర నేతలు అభి ప్రాయపడుతున్నారు. 
 
ఇదేవిషయాన్ని పలువురు నేతలు పార్టీ అధినాయకత్వం దృష్టికి చేరవేసినట్టు సమాచారం. ఇదిలావుంటే, పార్టీ అధ్యక్షుడి మార్పు విషయంపై స్వయంగా బండి సంజయ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి సంతోష్ సహా ఢిల్లీలో పలువురు పార్టీ పెద్దలను సంప్రదించినట్లు తెలిసింది. అయితే, ఈ విషయంపై ఇంకా ఏ నిర్ణయానికీ రాలేదని, పార్టీ కార్యకలాపాలను యదావిధిగా కొనసాగించాలని సంతోష్ సహా కొందరు పెద్దలు బండికి చెప్పినట్లు సమాచారం. 
 
కాగా, తనను పార్టీ బాధ్యతల నుంచి తప్పించకపోవచ్చని.. ఈటల, అరుణ తదితరులకు ఇతర కమిటీల్లో బాధ్యతలు అప్పగిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఎవరితోనైనా కలిసి పనిచేసుకుపోతానని సంజయ్ తన సహచరులు కొందరికి చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు