హైదరాబాద్ నగరంలోని కదులుతున్న ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడుని మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్‌గా గుర్తించారు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. రైలులో నిందితుడు ఎక్కడ ఎక్కడ ఎక్కాడో వివరాలు సేకరిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్‌లో ఎక్కినట్టు అనుమానిస్తున్నారు. అయితే, అల్వాల్ రైల్వే స్టేషన్‌లో సీసీ కెమెరాల్లో నిందితుడు కనిపించలేదు. అల్వాల్ రైల్వే స్టేషన్‌లో మహిళా బోగి నుంచి ఇద్దరు మహిళలు దిగడంతో అందులో యువతి ఒంటరిగా మిగిలింది. బోగీలో ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితుడు యువతి వద్దకు వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కాగా, ఈ ఘటనపై బాధితురాలు స్పందిస్తూ, "నేనూ రోజూ ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తాను. ఈ సంఘటన తర్వాత సాయంత్రం రైలులో వెళ్ళొద్దని మా పేరెంట్స్ చెప్పారు. అందుకే మధ్యాహ్నం లోపే వెళుతున్నాను. ఒక్కోసారి మహిళా బోగీలో ఒంటరిగా వెళ్తాను. ఆ టైములో భయమేస్తోంది. ఇప్పటివరకు నేను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయలేదు కానీ, ఈ ఘటన తర్వాత భయమేస్తుంది. మహిళా బోగీల్లో ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. లేడీ కానిస్టేబుల్స్‌ను బోగీల్లో ఉంచాలి'' అని తెలిపారు.