కదులుతున్న రైలులో మహిళను లైంగికంగా వేధించి.. రైల్లో నుంచి తోసేసిన...

గురువారం, 22 జూన్ 2023 (16:12 IST)
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని దారుణం చోటుచేసుకుంది. కదులుతోన్న రైల్లో ఓ మహిళపై ఐదుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడటమే గాకుండా.. ఆమె బంధువును బలవంతంగా బయటకు తోసేశారు. తీవ్ర గాయాలతో పట్టాల పక్కన అపస్మారక స్థితిలో పడిపోయిన వారిద్దరిని స్థానిక గ్రామస్థులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు... ఓ మహిళ తన బంధువుతో కలిసి జార్ఖండ్‌ నుంచి గుజరాత్‌ వెళ్లేందుకు సూరత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది. ఈ రైలు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ సమీపంలోకి చేరగానే కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను వేధించారు. అనుమతి లేకుండా ఫొటోలు తీశారు. దానికి ఆమె అభ్యంతరం తెలపడంతో.. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వారు ఆమె బంధువుపై దాడి చేశారు.
 
అయితే, సమస్య మరింత ముదరకుండా ఉండేందుకు బాధితులు రైల్లో వేరే చోటికి వెళ్లి కూర్చున్నారు. అయినా.. వదలని నిందితులు వారిని వెంబడించారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే బాధితురాలిని, ఆమె బంధువునూ కదులుతోన్న రైల్లోంచే కిందికి తోసేశారు. దీంతో తీవ్ర గాయాలపాలైన వారు.. రాత్రంతా పట్టాల పక్కనే అపస్మారక స్థితిలో ఉండిపోయారు.
 
సమీపంలోని బరోడి గ్రామస్థులు బాధితులను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. మహిళ వాంగ్మూలం ఆధారంగా ఇక్కడి బిలువా పోలీసులు.. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులను గుర్తించేందుకు స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలనూ పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు