ఏపీ సీఎం ఆఫీస్ ప్రత్యేకతలెన్నో... ప్రత్యేక కథనం...

బుధవారం, 12 అక్టోబరు 2016 (14:42 IST)
అమరావతి : పల్లెటూరు వాతావరణంలో రాష్ట్రస్థాయి పరిపాలన. అమరావతి సచివాలయం నుంచి పాలన సాగించాలని గట్టిగా సంకల్పించిన ముఖ్యమంత్రి ఆ దిశగా ఆచరణకు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం తన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సీఎం అమరావతి నేల నుంచే పాలన సాగించనున్నారు. పల్లెటూరు వాతావరణంలో పటిష్ట భద్రత... బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు... మంత్రివర్గ సమావేశాల నిర్వహణకు అవసరమైన సమావేశ మందిరం.. విశ్రాంతి గది, ప్రముఖులతో కలసి భోజనం చేయడానికి వీలైన డైనింగ్‌ హాల్‌, ఇటాలియన్ మార్బుల్‌తో ఫ్లోరింగ్... ఇలా అనేక ప్రత్యేకతలతో సిద్ధమైన ముఖ్యమంత్రి కార్యాలయ భవనంపై ప్రత్యేక కథనం.
 
మొత్తం ఆరు భవనాలుగా నిర్మితమవుతున్న అమరావతి(వెలగపూడి) సచివాలయంలో నాలుగు భవనాలు ఇప్పటికే పాలనకు అందుబాటులోకి వచ్చాయి. 2, 3, 4, 5 భవనాల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన మంత్రులంతా తమతమ శాఖలను ప్రారంభించేశారు. ఇక లాంఛనంగా ప్రారంభం కావాల్సింది రెండు భవనాలు మాత్రమే అందులో ఒకటి మొదటి భవనమైన ముఖ్యమంత్రి కార్యాలయ భవనం... ఆరో భవనమైన అసెంబ్లీ, మండలి సమావేశాల భవనం. ముఖ్యమంత్రి కార్యాలయ భవనంలో ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు, మంత్రివర్గ సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ ఇతర సమావేశ మందిరాలు ఈ భవనంలోనే ఉంటాయి. దీని నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి.
 
ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అత్యంత రక్షణాత్మకంగా నిర్మిస్తున్నారు. రాకెట్ లాంఛెర్లతో దాడి చేసినా ఏ మాత్రం చెక్కు చెదరని రీతిలో దీని నిర్మాణం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న జెడ్ ప్లస్ భద్రతా కారణాల దృష్ట్యా మొత్తం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో దీనిని నిర్మిస్తున్నారు. సీఎం కార్యాలయాన్ని సెక్యూరిటీ సిబ్బంది సూచనల మేరకు నిర్మాణంలో మార్పులుచేర్పులు చేస్తున్నారు. కార్యాలయం లోపల అంతర్గత అందాలు, సదుపాయాలు ముఖ్యమంత్రి సూచనలు, అభీష్టం మేరకు మార్పులు చేర్పులు చేశారు.
 
ఈ భవనం మొత్తం 72/70 మీటర్ల నిష్పత్తిలో 50 వేల చదరపు అడుగుల్లో నిర్మించారు. ఒక్కో భవనంలో రెండు అంతస్థులు కలిపి లక్ష చదరపు అడుగుల మేర నిర్మించారు. ఒక్కో భవంతికి 228 నుంచి 246 పైల్స్ ఉపయోగించారు. 3 అడుగుల వ్యాసార్థంలో వంద అడుగుల లోతులో పైల్స్ వేశారు. 11 మీటర్లతో 36 గదులను నిర్మించనున్నారు. ఇతర భవనాలకు లేని విధంగా ఏడు లిఫ్టులు ఈ భవనంలో ఉన్నాయి. ముఖ్యమంత్రికి మాత్రమే ప్రత్యేకంగా ఒక లిఫ్ట్ కేటాయించారు. సాంకేతికతకు ఎప్పుడూ పెద్దపీట వేసే ముఖ్యమంత్రి సచివాలయం నిర్మాణంలోనూ ఆ మార్క్ చూపించారు. విద్యుత్ పొదుపు చేసేందుకు ఈ మేర సాంకేతికతను వినియోగించటంతో పాటు అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

వెబ్దునియా పై చదవండి