ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే: ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ...

శుక్రవారం, 21 ఆగస్టు 2020 (13:41 IST)
ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు 21న జరుపుకుంటారు. వృద్ధులను ప్రభావితం చేసే సమస్యలపై అవగాహన పెంచడానికి ఈ రోజు అంకితం చేయబడింది. పుట్టిన ప్రతి మనిషి వయసు పెరగుతూ ఆపై క్షీణదశకు చేరుకోక తప్పదు. ఐతే ఆ వయసులో కొందరు తమ పిల్లల చేత అపురూపంగా ప్రేమించబడితే మరికొందరు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
 
ఈ క్రమంలో వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి జీవిత అధ్యయనాలు, వ్యక్తిగత అనుభవాలు పంచుకోవడం, వారి శ్రేయస్సును ప్రభావితం చేసే అంశాలపై పోరాడటానికి పరిష్కారాలు అందించే ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే సమాజానికి వృద్ధుల సహకారాన్ని గుర్తిస్తుంది. ఎందుకంటే వారి అనుభవాలు ఎంతో ఉన్నతమైనవిగా వుంటాయి. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న వారి జీవితాలు పాఠాలుగా నిలుస్తాయి.
 
ఐక్యరాజ్యసమితి ప్రకారం 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 20 శాతానికి పైగా.. అంటే 2 బిలియన్ ప్రజలు 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు వుంటారు. అత్యధికంగా వృద్ధులు ఆసియా ఖండంలో వుంటారు.
 
ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే చరిత్ర
ప్రపంచ సీనియర్ సిటిజెన్స్ డే చరిత్ర 1988 నాటిది. యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ అధికారికంగా ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డేను ప్రకటించారు. ఇది వృద్ధులకు, వారి సమస్యలకు అంకితమైన రోజు.
 
ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే వృద్ధుల సంక్షేమం కోసం పనిచేయడానికి ప్రభుత్వం తన నిబద్ధతను గుర్తుచేసే ముఖ్యమైన క్షణం. వృద్ధులను గుర్తుంచుకోవడం, వారి వారి కృషికి ధన్యవాదాలు తెలిపే మహత్తరమైన రోజు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు