అమిత్ షా.. భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాతి స్థానం ఈయనదే. ఈయన చెప్పిందే జరుగుతుంది. మోడీకి అత్యంత సన్నిహితుడు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వెళ్ళాలనేది వారి ఆలోచన. సుధీర్ఘంగా బీజేపీ సీనియర్ నేతలు చర్చించిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల వైపు అమిత్ షానే పంపించాలని నిర్ణయం తీసుకున్నారు.
తేదీని ఖరారు చేశారు. మొదటగా ఆపరేషన్ ఆకర్ష్‌లో తెలంగాణానే ఎంచుకున్నారు. ఇంకేముంది అమిత్ షా పర్యటనను ప్రారంభించారు. తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసలకు కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లాలో సోమవారం నుంచి పర్యటన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతూ, బీజేపీ గొప్పతనాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. మొదటిరోజే అమిత్ షా సమక్షంలో నల్గొండ జిల్లాలోని 50 మంది జడ్పీటీసీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంతమంది నేతలు బీజేపీ పార్టీలో చేరిపోయారు.
కేంద్రంలో భాజపాకు తిరుగులేదన్నది రాజకీయ విశ్లేషకుల భావన. మొన్న జరిగిన ఉత్తరాది ఎన్నికల్లో కూడా బీజేపీ తన హవాను కొనసాగించింది. పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఖచ్చితంగా ఎన్నికలపై ఉంటుందని అందరూ భావించారు. అయితే అది ఏ మాత్రం పనిచేయలేదు. నమో ప్రభంజనమే పనిచేసి చివరకు బీజేపీ బలపరిచిన ముఖ్యమంత్రులే పీఠాన్ని అధిరోహించారు. ఇదంతా దేశప్రజలకు తెలుసు.
వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదంతా జరుగుతుండగానే బీజేపీ పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళాలన్నదే మోడీ ఆలోచన. దేశంలో బీజేపీనిమించిన పార్టీ లేదన్న భావన ప్రజల్లో తెలియజేయాలన్నది ఆయన ఆలోచన. అందుకే ఒక్కొక్క రాష్ట్రంగా ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలెట్టారు. తన సన్నిహితుడు అమిత్ షాతో పాటు పార్టీలోని సీనియర్ నేతలందరితో కలిసి కూర్చుని నిర్ణయం తీసుకుని పర్యటనలను ప్రారంభించారు.
అమిత్ షా ఒక్కరే కాదు కేంద్రమంత్రులు, పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఆపరేషన్ ఆకర్ష్‌లో పాల్గొంటున్నారు. బీజేపీ చేస్తున్న ఈ కార్యక్రమాలతో తెరాస, కాంగ్రెస్ పార్టీలలలో గుబులు పట్టుకుంది. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు తేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ బీజేపీ ఇలా చేస్తుండటంతో ఇక కాంగ్రెస్ పార్టీ నేతల్లో నిద్రలేదట. మొత్తం మీద అమిత్ షా ఆపరేషన్ ఆకర్ష్ ఎంత మాత్రం పనిచేస్తుందో చూడాలి.