బీజేపీకి నాయకత్వం కరువు... ఎందుకు..?

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (14:22 IST)
రాబోయే కొన్నేళ్ళ పాటు తామే అధికారంలో ఉంటామని గొప్పలు చెప్పుకుంటూ ప్రజావ్యతిరేకతను సంపూర్ణంగా మూటగట్టుకుంటున్న బిజెపికి నాయకత్వం లోపం ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్క నరేంద్ర మోడీ మరో వైపు అమిత్ షాలు మినహా ఇంకెవరూ పార్టీలో లేరన్నట్లుగానే కనిపిస్తోంది. సీనియర్లను ఇప్పటికే మూటకట్టి మూలనపెట్టేసిన ఆ పార్టీ నాయకత్వం ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చేసరికి ఆపసోపాలు పడుతోంది.
 
కేంద్రంలో అధికారం చేపట్టినా బీజేపీకి రాష్ట్రాల్లో మాత్రం నాయకులు లేకుండా పోతున్నారు. కేంద్రంలో పెద్ద నేతలుగా చెలామణి అయ్యే వారితో సహా ఏ మంత్రీ రాష్ట్ర స్థాయిలో ప్రజల మెప్పు పొందిన వారు కారన్నది గుర్తించాలి. ఫలితంగా రాష్ట్రాలలో ఎన్నికలు వచ్చేసరికి ప్రతిసారి నరేంద్ర మోడీ ప్రచారంలోకి దిగాల్సి వస్తోంది.
 
ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పరిస్థితి ఇలాగే ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా ముందుగా ప్రకటించలేకపోతున్నారు. గోవాలో అయితే కేంద్రమంత్రి మనోహర్ పారికర్ ని తిరిగి ముఖ్యమంత్రిగా పంపుతామనే సంకేతాలు ఇస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి గెలిస్తే కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని పంపుతామని చెప్పుకోవడమే తప్పించి రాష్ట్ర స్థాయిలో ఇతను మా నేత అని ప్రజల ముందు నిలబెట్టుకోలేకపోతున్నారు. 
 
అన్ని స్థాయిల్లోనూ నాయకత్వం ఎదగలేకపోతే పార్టీ పటిష్టంగా ఉండదన్న సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీని చూసి అయినా బిజెపి నేర్చుకోవడంమ లేదు. దీనికి తగిన మూల్యమూ చెల్లించుకోవాల్సిన సమయం ఆసన్నం అయ్యిందని అంటున్నారు చూడాలి. మరి ఏం జరుగుతుందో..

వెబ్దునియా పై చదవండి