'తమ్ముడు' పవన్ కళ్యాణ్‌ను సీఎం చేసేందుకు మెగాస్టార్ ప్లాన్స్... ఏం చేస్తున్నారేంటి?

సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (16:40 IST)
2019 ఎన్నికల్లో జనసేన పార్టీకే అధికారం దక్కుతుందని మెగా సోదరుడు నాగబాబు ఇప్పటికే జోస్యం చెప్పేసిన నేపథ్యంలో.. ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పవన్ కల్యాణ్ కసరత్తు మొదలుపెట్టారు. ప్రజల్లోకి వెళ్ళి.. వారి సమస్యలు తెలుసుకుని 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు.

కానీ పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే  సీటుతో పాటు ఏకంగా సీఎం సీటే దక్కుతుందని రాజకీయ పండితులు కూడా జోస్యం చెప్పేస్తున్నారు. ఏపీలో సమర్థవంతమైన నాయకత్వం ఉండికూడా ప్రజా సమస్యలను సర్కారు తీర్చలేకపోతోందనే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. విభజనకు తర్వాత ఏపీ కష్టాల్లో కూరుకుపోయింది. 
 
అభివృద్ధికి నిధుల్లేక ప్రతీ దానికి చంద్రబాబు సర్కారు కేంద్రం వైపు చూస్తోంది. ఈ క్రమంలో కేంద్రంతో యుద్ధానికి సిద్ధపడకుండా కామ్‌గా పనికావాలనే ఉద్దేశంతో ఏపీలోని చంద్రబాబు సర్కారు ముందుకెళ్తోంది. అమరావతి అభివృద్ధికి నిధులు కేంద్రం నుంచి ప్యాకేజీ రూపంలో రావడం కోసం ఎదురుచూస్తుంది. ఇందులో భాగంగా స్పెషల్ స్టేటస్ సంగతిని కూడా టీడీపీ యంత్రాంగం పక్కనబెట్టేసింది. 
 
ఏపీ అభివృద్ధికి డబ్బులొస్తే చాలునని హోదా ప్రయోజనం లేదని ఇప్పటికే టీడీపీ నిర్ణయానికి వచ్చేసింది. కేంద్రం ప్యాకేజీ కింద ఇస్తామన్న నిధులను సకాలంలో ఇస్తే అభివృద్ధి పనులు సాధ్యమవుతాయని బాబు సర్కారు భావిస్తోంది. కానీ బీజేపీ మాత్రం విభజన సమయంలో ఏపీకి హోదా ఇస్తామని పలికిన ప్రగల్భాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ప్యాకేజీలో మొత్తాన్ని కూడా మెల్లమెల్లగా పంపుతోంది. 
 
హోదాకు చట్టబద్ధత కల్పించడంలో జాప్యం చేస్తోంది. ఇవన్నీ చూసిన ప్రజలు విసిగిపోయారు. దీంతో కొత్త నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ వైపే పవనాలు వీచే అవకాశం వున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్‌కు 2019 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలుస్తారని అనుకుంటున్నారు. ఇప్పటికే 2019 ఎన్నికల కోసం పూర్తిస్థాయి కసరత్తులు చేస్తున్నారు.. పవన్ కల్యాణ్.
 
తాజాగా 2019లో పవన్‌కే పవరొస్తుందని నాగబాబు కూడా చెప్పారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జరుగుతుందని చెప్పారు. ఇంకా 2019 ఎన్నికల ప్రచారంలో తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ప్రచారం చేస్తే బాగుంటుందని వ్యక్తిగతంగా ఆశించారు. ఓ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. జనసేన తరపున తమ్ముడి కోసం అన్నయ్య ప్రచారం చేస్తే తప్పకుండా విజయం ఖాయమని.. అప్పుడే ఏపీలో జనసేనకు పవరొస్తుందని.. నీతి నిజాయితీ గల వ్యక్తి రాజకీయాల్లో వచ్చినట్లవుతుందని తెలిపారు. మరి మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి వుంది. 
 
ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. ఆపై కాంగ్రెస్‌లో దాన్ని విలీనం చేసి.. ప్రస్తుతం సినిమాల వైపు దృష్టి పెట్టిన చిరంజీవి.. ఇకపై రాజకీయాలకు స్వస్తి చెప్తారని సమాచారం. అందుకే కాంగ్రెస్ పార్టీకి కూడా చిరంజీవి దూరమై జనసేనకు మద్దతు పలికి.. పవన్‌ను గెలిపిస్తారని.. తద్వారా రాజకీయాలకు బై చెప్పి.. సినిమాలు చేసుకుంటూ పోవాలని చిరంజీవి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చిరంజీవి ప్రచారం ఏ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి