2జీ స్పెక్ట్రమ్ స్కామ్.. అసలైన కథా కమామీషు...

గురువారం, 21 డిశెంబరు 2017 (15:48 IST)
2జీ స్పెక్ట్రమ్ స్కామ్.. దేశాన్ని ఓ కుదుపుకుదిపిన భారీ స్కామ్. దేశంలో వెలుగు చూసిన అతిపెద్ద స్కామ్‌లలో ఇది ఒకటి. గత యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో చోటుచేసుకుంది. రెండోతరం రేడియో టెలికాం తరంగాల వేలం పాటల్లో అక్రమాలకు, అవినీతికి పాల్పడటం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఓ నివేదిక రూపంలో తేల్చింది. ఈ స్కామ్ 2008లో జరిగింది. 
 
ఈ స్కామ్‌లో ప్రధాన నిందితులు అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎ.రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కూతురు కనిమొళితో సహా మొత్తం 14 మంది నిందారోపణలు ఎదుర్కొన్నారు. 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సుల జారీలో కొన్ని చట్టాలను ఉల్లంఘించారని, భారీగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు అర్హత లేని, టెలికాం రంగంలో అనుభవం లేని యూనిటెక్ అండ్ స్వాన్ టెలికామ్ కంపెనీకి లేదా ముందుగానే దీనికి సంబంధించిన సమాచారం ఉన్న కంపెనీలకు అక్రమంగా లైసెన్సులు కట్టబెట్టినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. 
 
2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు సీబీఐ నమోదు చేయగా.. మూడోది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసింది. ఆరేళ్ళ కిందట సీబీఐ మొదటి చార్జిషీట్ దాఖలు చేయడంతో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. 
 
మొదటి కేసులో రాజా, కనిమొళితోపాటు నాటి టెలికంశాఖ కార్యదర్శి సిద్ధార్థ బెహురా, రాజా ప్రైవేట్ సెక్రటరీ ఆర్కే చందోలియా, స్వాన్ టెలికాం ప్రమోటర్స్ షాహిద్ ఉస్మాన్ బల్వా, వినోద్ గోయెంకా, యునీటెక్ లిమిటెడ్ ఎండీ సంజీవ్ చంద్ర, ఆర్‌ఏడీఏజీకు చెందిన గౌతమ్ దోషి, సురేంద్ర పిపర, హరి నాయర్, కుసెగావ్ ఫ్రూట్స్ అండ్ వెజిటెబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఆసిఫ్ బల్వా, రాజీవ్ అగర్వాల్, కలైంజ్ఞర్ టీవీ డైరెక్టర్ శరత్‌కుమార్, బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ నిందితులుగా ఉన్నారు. 
 
ఈ 14 మంది వ్యక్తులతోపాటు స్వాన్ టెలికాం ప్రైవేట్ లిమిటెడ్(ఎస్టీపీఎల్), రిలయన్స్ టెలికామ్ లిమిటెడ్, యునీటెక్ వైర్‌లెస్ (తమిళనాడు) లిమిటెడ్ కంపెనీలపై సీబీఐ అభియోగాలు మోపింది. 122 లైసెన్సులను ఇవ్వడం ద్వారా రూ.30,984 కోట్ల నష్టం వాటిల్లినట్టు సీబీఐ చార్జిషీట్‌లో తెలిపింది. అనంతరం ఆర్‌ఏడీఏజీ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన సతీమణి టీనా అంబానీ, కార్పొరెట్ లాబీయిస్ట్ నీరా రాడియాతోపాటు 154 మంది సాక్షుల వాంగ్మూలాలను సుప్రీంకోర్టు రికార్డు చేసింది. 
 
సీబీఐ రెండో కేసులో.. ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్లు రవి రూయా, అన్షుమన్ రూయా, లూప్ టెలికమ్ ప్రమోటర్లు కిరణ్ ఖైతాన్, ఆమె భర్త ఐపీ ఖైతాన్, ఎస్సార్ గ్రూప్ డైరెక్టర్ (స్ట్రాటజీ అండ్ ప్లానింగ్) వికాస్ సరఫ్‌తోపాటు లూప్ టెలికం లిమిటెడ్, లూప్ మొబైల్ ఇండియా లిమిటెడ్, ఎస్సార్ టెలీహోల్డింగ్ లిమిటెడ్ (ఈటీహెచ్‌ఎల్) కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చారు. 
 
మూడో కేసు విషయానికి వస్తే.. ఏప్రిల్ 2014న 19 మందిపై ఈడీ చార్జిషీట్ నమోదు చేసింది. డీఎంకే పార్టీకి చెందిన కలైంజ్ఞర్ టీవీలో ఎస్టీపీఎల్ కంపెనీ రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టిన కేసులో డీఎంకే అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్ పేరును ఈడీ చార్జిషీట్‌లో చేర్చింది. మనీలాండరింగ్ ప్రివెన్షన్ యాక్టు కింద ఈడీ తన తుది నివేదికలో మొత్తం 10 మంది వ్యక్తులను, 9 కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చింది. 
 
ఈ కేసులపై ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరిపి గురువారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 14 మంది తప్పు చేసినట్టు ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టలేక పోయిందని పేర్కొంటూ కేసును కొట్టివేసింది. దీంతో 14 మంది నిర్దోషులుగా విడుదలయ్యారు. కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి వంటివారు పైకోర్టును ఆశ్రయిస్తామంటూ ప్రకటించారు. మొత్తంమీద దేశంలో ఓ సంచలనమైన 2జీ స్కామ్‌లో గురువారం వెలువడిన తుది తీర్పు అంతే సంచలనంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు