దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కర్ణాటక పోల్స్...

బుధవారం, 9 మే 2018 (14:06 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 12వ తేదీన జరుగనుంది. 15వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం అధికార కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీల అభ్యర్థులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా వారు ముందుకుసాగుతున్నారు. ఇందుకోసం అభ్యర్ధులు ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదు. దాంతో నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఏరులై పారుతోంది.
 
ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు.. ఎన్నికల సంఘం సూచించిన మొత్తానికి వంద రెట్లు ఎక్కువ ఖర్చుచేస్తున్నారట. దీంతో కన్నడ అసెంబ్లీ ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలవనున్నాయి. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుతున్న సమయంలో ఏయే పార్టీలు.. ఎక్కడెక్కడ, ఎంతెంత ఖర్చుచేయబోతున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల ఖర్చు ఎంత? అంశాలపై ఓటర్లతోపాటు పరిశీలకుల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
 
ముఖ్యంగా, కర్ణాటక ఎన్నికలను జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి 2019 సార్వత్రిక ఎన్నిలకు శక్తిని కూడగట్టుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. అలాగే, దక్షిణభారతంలో పార్టీ మనుగడ కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దాంతో ఇరుపార్టీలు ముఖ్యనేతలను రంగంలోకి దించి విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నాయ్. 
 
కాంగ్రెస్‌ తరపున అధ్యక్షుడు రాహుల్, మాజీ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్‌ నేతలు శశిథరూర్, అశోక్‌ చవాన్, ఉమెన్‌ చాందీ, సుశీల్‌ కుమార్‌ షిండేతో పాటు పలువురు కేంద్ర మాజీమంత్రులు ప్రచారం చేస్తున్నారు. అలాగే, బీజేపీ తరపన ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సహా కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రచారం చేస్తున్నారు. వీరంతా కర్ణాటక రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. 
 
అయితే, కర్ణాటక శాసనసభలో మొత్తం 224 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు నియోజకవర్గంలో ఒక్కో పార్టీ అభ్యర్థి రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి వుంది. కానీ బీజేపీ, కాంగ్రెస్‌లు సగటున రూ.20 కోట్ల మేర ఖర్చు చేస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గ స్థానం, అభ్యర్థి ఆర్థిక శక్తి మేరకు ఒక్కో స్థానంలో రూ.30-50 కోట్లు, రూ.50-70 కోట్లు, రూ.100 కోట్ల మేరకు ఖర్చు చేస్తున్నారు. 
 
అంటే, సగటున రూ.20 కోట్లుగా లెక్కేసినా ఒక్కోపార్టీకి రూ.4,450 కోట్లు ఖర్చుకానుంది. కొన్ని కీలక నియోజకవర్గాల ఖర్చు పరిగణనలోకి తీసుకుంటే మొత్తం రూ.5 వేల కోట్ల పైమాటే. ఇక జేడీఎస్ తో పాటు స్వతంత్ర అభ్యర్ధుల ఖర్చులను కూడా కలుపుకుంటే కర్ణాటక ఎన్నికల ఖర్చు అనధికారికంగా రూ.13 వేలకోట్లుపైనే ఉంటుందని అంచనా. అందుకే దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కర్ణాటక ఎన్నికలు మిగిలిపోనున్నాయని చెప్పొచ్చు. మరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మే 15వ తేదీ వరకు వేచిచూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు