రెండు నాలుకల ధోరణిలో పవన్ కళ్యాణ్‌... ఎలాగంటే...

శనివారం, 27 జనవరి 2018 (15:01 IST)
ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావడమేకాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోను తన పర్యటనలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రారంభించిన విషయం తెల్సిందే. పవన్‌ను రాజకీయంగా ఎదుర్కోవడమేకాకుండా ఆయన్ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. 
 
పవన్ కళ్యాణ్‌ పోటీ చేస్తే ఖచ్చితంగా ఓట్లు చీలిపోతాయేమోనన్న భయం కూడా ప్రస్తుతం రాజకీయ పార్టీల నేతల్లో పట్టుకుంది. అందుకే పవన్ కళ్యాణ్‌ గురించి ప్రత్యక్షంగాకాకుండా పరోక్షంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా మార్చుకుంటున్నారు.
 
పవన్ కళ్యాణ్‌ గతంలో మొదటిసారి ప్రజల్లోకి వచ్చి జనసేనపార్టీ తరపున మాట్లాడారు. అప్పట్లో రాష్ట్ర విభజన జరగడం కొత్త రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్‌ ఒక సభను పెట్టి కేసీఆర్‌ను ఏకి పారేశారు. నేను తెలంగాణా బిడ్డనైనా ఏపీ ప్రజలను తెలంగాణా నేతలు హీనంగా మాట్లాడటం ఇష్టంలేదు. ఇది మానుకోవాలి. కేసీఆర్ ఖబడ్దార్ అంటూ భారీ డైలాగ్‌లో వదిలారు. దీంతో తెరాసకు పవన్ కళ్యాణ్‌ పూర్తి వ్యతిరేకమని అందరూ భావించారు. 
 
కానీ ఇప్పుడు తాజాగా తెలంగాణా రాష్ట్రంలో పర్యటిస్తూ నాలుగురోజులుగా అభిమానులు, పార్టీ నాయకులతో సమావేశమవుతున్న పవన్ కళ్యాణ్‌ కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణా బిడ్డగా మీ ముందుకురావడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సీఎం కేసీఆర్ బాగా పనిచేస్తున్నారని, అవసరమైతే తెలంగాణా ప్రజల కోసం రక్తం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పవన్ ప్రసంగంతో జనసేన నాయకులు, కార్యకర్తలే ఆశ్చర్యపోయారు. 
 
ఒకప్పుడు కేసీఆర్‌ను దుమ్ముదులిపేసిన పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు పొగుత్తుడాడేంటి అంటూ ముక్కున వేలేసుకున్నారు. అంతేకాదు తెలంగాణా పర్యటించినన్ని రోజులు కేసీఆర్‌ను పొగడడమే పనిగా పవన్ కళ్యాణ్‌ పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పవన్ కళ్యాణ్‌ అవకాశవాది అని, అవసరాన్ని బట్టి మాట్లాడుతుంటారని, రెండు నాల్కల ధోరణి అంటే ఇదేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు