సిద్ధమేనా..? : జమిలి ఎన్నికలకు రోడ్‌ మ్యాప్‌

సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (22:37 IST)
‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’ అమలుపై కేంద్రం బాగానే దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాటలు త్వరలోనే అమలుకానున్నాయా..? అంటే ఆ దిశగానే అడుగులు పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ పాలిత ప్రాంతాలు జమిలిని దృష్టిలో పెట్టుకునే ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర పథకాలను విరివిగా వినియోగించుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎటుచూసినా జమిలి ఎన్నికలపై వామపక్షాల నుంచి తప్పా ఇతర పార్టీల నుంచి పెద్దగా వ్యతిరేకించే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో 22 పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు ప్రకటించాయి. ఇక అప్పటి నుంచీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న కేంద్రం తాజాగా ఇందుకు సంబంధించి ఆచరణీయమైన రోడ్‌ మ్యాప్‌, ఫ్రేమ్‌ వర్క్‌ను లా కమిషన్‌ రూపొందించనున్నట్లు కేంద్రం ప్ర‌క‌టించింది.
 
వ‌చ్చే ఏడాది చివ‌రి నాటికే..?
కేంద్రం తాజా ప్రకటనతో రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. లోక్‌సభలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌ రెడ్డి, వంగా గీత, మన్మె శ్రీనివాస్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు స‌మాధానంగా కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ జమిలి ఎన్నికలకు సంబంధించిన రూట్‌ మ్యాప్ అంశాన్ని ప్ర‌స్తావించారు. ఇప్పటికే సిబ్బంది, ప్రజా సమస్యలు, న్యాయ శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయూ సంఘం జమిలి ఎన్నికలకు సంబంధించి అధ్యయనం చేయడమే కాక, ఎన్నికల సంఘంతోనూ చర్చించి తన 79వ నివేదికలో కొన్ని సిఫారసులు చేసిందని ఆయన తెలిపారు. వీటన్నింటినీ లా కమిషన్‌ పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా జమిలి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనని ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ వచ్చే ఏడాది చివరిలోగా జమిలి రూపకల్పన కొలిక్కి వచ్చే అవకాశాలను తెలియజేస్తున్నాయి.
 
కొత్తేం కాదు...
వాస్తవానికి దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలను మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతరం కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవటం, గడువుకు ముందే పలు రాష్ట్రాలు శాసనసభలను బర్తరఫ్‌ చేయటం వంటి కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుపటం మొదలైంది. 1983లోనే నాటి ఎన్నికల సంఘం చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని ప్రతిపాదించింది. 1999లో లా కమిషన్‌ ఇదే సూచన చేసింది.
 
జమిలి ఎన్నికలపై లా కమిషన్‌ రెండేండ్ల కిందట అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించగా.. సమాజ్‌వాదీ పార్టీ, అన్నాడీఎంకే తదితర పార్టీలు మద్దతిచ్చాయి. బీఎస్పీ, టీడీపీ, తృణమూల్‌ వ్యతిరేకించాయి. కాంగ్రెస్‌, బీజేపీ తమ వైఖరి స్పష్టంగా పేర్కొనలేదు. ఆయా పార్టీల అభిప్రాయాల‌లోనే అప్ప‌టికి, ఇప్ప‌టికీ చాలా తేడాలు వ‌చ్చాయి. 2015లో పార్లమెంటరీ కమిటీ జమిలి ఎన్నికలకు ప్రతిపాదించింది. జమిలికి సిద్ధమని 2017లో నాటి సీఈసీ ఓపీ రావత్‌ ప్రకటించారు. 2021నాటికి రెండు దశలుగా జమిలి ఎన్నికలు జరుపొచ్చంటూ నీతి ఆయోగ్‌ గతంలో ఒక నివేదికను సమర్పించింది.
 
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో..
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జమిలి ఎన్నికల విధానం అమల్లో ఉంది. స్వీడన్‌, ఇండొనేషియా, దక్షిణాఫ్రికా, జర్మనీ, స్పెయిన్‌, హంగరీ, బెల్జియం, పోలాండ్‌, స్లోవేనియా, అల్బేనియా తదితర దేశాల్లో చట్టసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయి. దక్షిణాఫ్రికాలో ప్రతి ఐదేండ్లకూ జాతీయ అసెంబ్లీ, రాష్ట్రాల‌ శాసనసభలు, మున్సిపల్‌ కౌన్సిళ్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. స్వీడన్‌లోనూ ఇదే తరహా విధానం ఉంది. ఇండోనేషియాలో అధ్యక్ష, రాష్ట్ర చట్టసభల ఎన్నికలు ఒకేసారి నిర్వ‌హించ‌డం 2019 నుంచే మొద‌లైంది. అయితే.. జ‌మిలి ఎన్నిక‌ల విధానం అమ‌ల‌వుతున్న చాలా వరకు దేశాల్లో అధ్యక్ష తరహా పాలన ఉండటం గమనార్హం. వాటికి, మ‌న దేశానికి ఎన్నిక‌ల విధానంలో అనేక తేడాలు ఉంటాయి. దేశంలో జ‌మిలి వెనుక ఆర్థిక‌, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఎలాగున్నా నిర్వ‌హ‌ణ‌పై కేంద్రం సిద్ద‌మ‌వుతున్న‌ట్లే క‌నిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు