తమిళనాడు మంత్రులకు ఐటీ శాఖ ఉచ్చు బిగిస్తోంది. ముఖ్యంగా ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంపణీ చేసినట్టు ఆరోణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామితో పాటు ఏడుగురు మంత్రుల వద్ద పూర్తి స్థాయిలో విచారించాలని ఐటీ అధికారులు భావిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి పళనిస్వామిని విచారణకు పిలవాలన్న భావనలో ఉన్నట్టు సమాచారం.
ముఖ్యంగా ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ నివాసంలో చేసిన సోదాల్లో ముఖ్యమంత్రితో పాటు.. ఏడుగురు మంత్రులు, కొందరు నేతలు కలిసి 89 కోట్ల రూపాయలను పంచినట్టు ఆధారాలు లభించాయి. దీంతో మంత్రి విజయభాస్కర్‌ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది.
అలాగే, మంత్రి విజయభాస్కర్ ఇంట్లో జరిగిన సోదాల సమయంలో మహిళా ఐటీ అధికారిని బెదిరించిన కేసులో ఇద్దరు మంత్రులపై ఐటీ అధికారులు నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిని కూడా ఎపుడైనా నగర పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.
మరోవైపు ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్షా సమయంలో ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి కొనుగోలు చేశారనీ, అందువల్ల ఆ సర్కారును రద్దు చేయాలని డీఎంకేతో పాటు ఇతర విపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తున్న కేంద్రం... ఐటీ, ఈసీ నివేదికలను పరిశీలించిన తర్వాత పళనిస్వామి సర్కారును రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.