ఎస్ఈసీ వర్సెస్ జగన్ : ఇదీ ఎన్నికల సంఘం పవర్‌!

బుధవారం, 18 మార్చి 2020 (14:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిల మధ్య వార్ జరుగుతోంది. కరోనా వైరస్ భయం నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. ఏకంగా ఎస్ఈసీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 
 
అంతేకాకుండా, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. పైగా, ఆరు వారాల తర్వాత రాష్ట్ర యంత్రాంగాన్ని సంప్రదించి తదుపరి చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుపై వైకాపా శ్రేణులు నోరు మెదపడం లేదు. 
 
అయితే, అసలు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసి, స్వయంప్రతిపత్తి కలిసిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను ఓసారి పరిశీలిద్ధాం. ముఖ్యంగా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఎంత శక్తిమంతం అన్నది ఆ పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. 
 
ఆ సమయంలో ఎన్నికల సంఘం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే మార్చేసింది. అప్పటివరకు ఉన్న అనిల్‌చంద్ర పునేఠాను మార్చి ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్‌గా నియమించింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చింది. ఇంకో విషయం... ఆనాడు ఎల్వీ సుబ్రమణ్యాన్ని సీఎస్‌గా నియమించిన విషయం, ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న విషయం మీడియా ద్వారానే అప్పటి సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. అదీ ఎన్నికల సంఘం పవర్‌! 
 
అదేవిధంగా నిఘా బాస్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును కూడా అప్పట్లో ఎన్నికల సంఘం ఆ విధుల నుంచి తప్పించింది. ప్రభుత్వ యంత్రాంగం దాన్ని అమలుచేసింది. అంతేతప్ప దానిపైన సంక్షోభం సృష్టించలేదు. యుద్ధం ప్రకటించలేదు. అలా ప్రకటించేందుకు ఆస్కారం, అవకాశం కూడా లేదు. రాజ్యాంగానికి లోబడి ఉండే ఏ ప్రభుత్వమూ ఆ పని చేయలేదు. అలా చేసే హక్కు కూడా ప్రభుత్వాలకు లేదు. 
 
అలాగే, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి అధికారాలు ఉంటాయో... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికీ అలాంటి అధికారాలే ఉంటాయి. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే స్వయంగా స్పష్టంగా చెప్పింది. గతంలో ఎప్పుడూ రాష్ట్ర ఎన్నికల సంఘంతో ప్రభుత్వాలు ఇలా సంక్షోభం తెచ్చుకోలేదు. 
 
రాష్ట్ర ప్రభుత్వం - ఎన్నికల సంఘాలకు మధ్య యుద్ధం జరగలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘంగా రమాకాంత్‌ రెడ్డి, ఏవీఎస్‌ రెడ్డి, కాకి మాధవరావు ఇలా ఎవరు చేసినా వారి హయాంలో అటు కాంగ్రెస్ - ఇటు తెలుగుదేశం ప్రభుత్వాలు రెండూ ఉన్నా ఎప్పుడూ రాజ్యాంగ సంక్షోభం, ధిక్కరణ మాత్రం జరగలేదని పలువురు గుర్తుచేస్తున్నారు. కానీ, ప్రస్తుత సీఎం జగన్ మాత్రం గత సీఎంలకంటే భిన్నంగా ప్రవర్తిస్తుండటమే ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు