స్వామి.. నన్ను సీఎంగా కొనసాగించు...! శ్రీవారి సేవలో పళణిస్వామి...

మంగళవారం, 9 మే 2017 (13:30 IST)
తమిళనాడులో ఇప్పుడిప్పుడే రాజకీయ వేడి తగ్గుతున్న తరుణంలో తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళణిస్వామి దర్శించుకున్నారు. ఉదయం అష్టదళపాదపద్మారాధన సేవలో స్వామిసేవలో తమిళ సీఎం తరించారు. ముందు నుంచి పళణిస్వామి ఎన్నిక వివాదాస్పదంగానే మారింది. అసలు ముఖ్యమంత్రి అవుతానని ఎప్పుడూ పళణిస్వామి అనుకోలేదు. అలాంటిది జాక్‌పాట్‌లా పళణిస్వామికి ఆ అవకాశం లభించింది. చిన్నమ్మకు అత్యంత సన్నిహితంగా ఉండటమే పళణిస్వామికి కలిసొచ్చింది. అయితే ప్రస్తుతం పార్టీ నుంచి శశికళతో పాటు ఆమె మేనల్లుడు దినకరన్ దూరంగా ఉండటంతో తిరిగి మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పార్టీలో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు.
 
కలిసికట్టుగా పనిచేసి అన్నాడీఎంకే పార్టీని ముందుకు తీసుకెళ్ళాలనేది పన్నీరుసెల్వం ఆలోచన. అందుకే వారంరోజుల పాటు సుధీర్ఘంగా పన్నీరు, పళణిస్వామి వర్గీయులు ఇద్దరూ మాట్లాడుకున్నారు. పళణికి ఉపముఖ్యమంత్రి, పన్నీరుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే కొంతమంది దీనికి సమ్మతించకపోవడంతో కమిటీని పెట్టుకున్నారు.
 
కానీ ఆ కమిటీ నివేదిక కొన్ని రోజుల సమయం పడుతుండడంతో పళణిస్వామి శ్రీవారిని ప్రార్థించేందుకు తిరుమలకు వచ్చారు. స్వామి సిఎంగా నన్ను ఇలాగే ఉంచు.. అంటూ పళణిస్వామి వేడుకున్నట్లు తెలుస్తోంది. పళని స్వామివారిని దర్శించుకోవడం తమిళనాట తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.  

వెబ్దునియా పై చదవండి