ఏ తరంలోనైనా పెద్దవాళ్లలో ఏదో సాధించేసామనే తృప్తికన్నా ఇంకేదో సాధించలేకపోయామే అనే బాధే ఎక్కువగా కనబడుతుంది. దీనికి ఎవ్వరూ మినహాయింపు కారనేది నిర్వివాదాంశం. దానిని పిల్లలపై రుద్ది తద్వారా తాము పొందలేని సుఖ సంతోషాలను వారు పొందితే తృప్తి పడాలనుకొని అందుకోసం నానా కష్టాలు పడి అధిక మొత్తాలను ఫీజుల రూపంలో చెల్లించడం తండ్రుల తప్పా...
లేదా పిల్లలతో మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకునే సమయం కూడా కేటాయించకుండా పెద్ద స్కూల్‌లలో ఫీజులు కట్టేశాం... అవసరమైతే ట్యూషన్‌లు కూడా ఏర్పాటు చేస్తాం... మార్కులు మాత్రం తగ్గేదానికి లేదని తెగేసి చెప్పి తమ మానాన తమ తమ వంటపనులు, అవి పూర్తయ్యాక టీవీ సీరియళ్లకు అంకితమైపోవడం అమ్మల తప్పా.