అప్పుడు ఎంజీఆర్-ఇప్పుడు జయలలిత సేమ్ హిస్టరీ సీన్ రిపీట్.. అజిత్ ఎంట్రీ ఇస్తాడా?
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (15:52 IST)
తమిళనాడు సీఎం జయలలిత 15 రోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటివరకు బులిటెన్లు విడుదలవుతున్నా.. ఆమె ఆస్పత్రిలో ఎలా ఉన్నారనే దానిపై ఫోటోలు రిలీజ్ కాలేదు. ఆమెను పరామర్శించేందుకు వచ్చేవారిని కూడా జయమ్మను చూడనివ్వట్లేదని.. వైద్యులే ఆమె ఆరోగ్య పరిస్థితిని నచ్చజెప్పి పంపిస్తున్నారని టాక్ వస్తోంది.
జయకున్న పాపులారిటీ రీత్యా.. శాంతిభద్రతల సమస్యకు దారితీయొచ్చుననే భయంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై నిజమేంటో చెప్పేందుకు వైద్యులు జడుసుకుంటున్నారు. అయితే అదిగో పులి.. ఇదిగో తోక అన్నట్లు జయమ్మ వ్యవహారాన్ని చేస్తే మాత్రం ప్రమాదం తప్పదని విశ్లేషకులు అంటున్నారు.
ఒకప్పటి సీనే మళ్లీ రిపీట్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందేంటంటే.. ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమైంది. విదేశాల్లో చికిత్సకు వెళ్ళివచ్చిన ఎంజీఆర్ నోట మాట రావడం లేదని వార్తలొచ్చిన నేపథ్యంలో.. ఆనాడు జరిగిపోయిన పెద్ద రభసతో.. ఆయన మాటలతో రికార్డ్ చేసిన ఒక టేపును పార్టీ విడుదల చేసింది. పరిస్థితిని కొంత అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఇంకా ఎంజీఆర్ బెడ్ మీద ఉండగానే ఎన్నికల్లో ఆయన నామినేషన్‌పై సంతకం చేసి గెలిచారు కూడా. ఆ తర్వాత ఆయన మరణించడం, ఆపైన పార్టీ పగ్గాల్ని ఆయన శ్రీమతి చేపట్టాలా? లేకుంటే జయలలితకు అప్పగించాలా అనే దానిపై సస్పెన్స్ ఏర్పడింది. చివరికి అమ్మే అన్నాడీఎంకే పార్టీని తన చేతుల్లోకి తీసుకుంది. ప్రస్తుతం ఎంజీఆర్ లాగానే ఆస్పత్రిలో ఉంటూనే జయలలిత పని కానిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మొన్నటికిమొన్న ఆమె అక్రమాస్తుల కేసులు జైలుకు వెళ్లినప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం ఏ కీలక నిర్ణయం తీసుకోకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూపోయిన కాలంలో ఆ రాష్ట్ర పరిపాలన దాదాపుగా స్తంభించిపోయింది. అన్నాడీఎంకేలో జయలలితకు తగిన మనిషి లేరనే చెప్పాలి. అందరూ ఆమె కాళ్లు మొక్కేవాళ్లే కానీ.. ఆమెకు ధీటుగా సమర్థవంతంగా అన్నాడీఎంకేను నడిపే సత్తా పార్టీలో ఏ ఒక్కరికీ లేదు.
జయలలిత కేవలం.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే కాదు. ఇవాళ పార్లమెంట్‌లో మూడో అతిపెద్ద పార్టీకి అధినేత్రి. జయమ్మ తర్వాత సెకండ్ లెఫ్టినెంట్ ఎవరన్న విషయంలో ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. జయమ్మ ఆరోగ్యంపై నిజాలు దాచిపెట్టడం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేగాకుండా జయలలిత ఆరోగ్యంపై స్పష్టమైన ప్రకటన, ఫోటోలు రిలీజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఎంజీఆర్‌లా మంచం పట్టిన జయలలిత మెరుగైన చికిత్సతో మళ్లీ అధికారం చేపడుతుందా? లేకుంటే జయమ్మకు ధీటుగా నాయకత్వ లక్షణాలను కలిగివున్న వ్యక్తి ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే భారీ క్రేజ్, మాస్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ కుమార్‌ను రంగంలోకి దించుతారా అనేది సస్పెన్స్.