తిరుమల శ్రీవారి ఆలయంలో కనిపించకుండా పోయిన ఆభరణాలపై ఇప్పుడు ఎక్కడ నలుగురు కలిసినా చర్చ జరుగుతోంది. పటిష్ట బందోబస్తు ఉన్న ట్రెజరీ నుంచి శ్రీవారి ఆభరణాలను ఎలా మాయం చేశారు. ఎవరు ఎత్తుకెళ్ళారు. అసలు ట్రెజరీలో నగలు పోయిన రెండు సంవత్సరాల తరువాత ఈ విషయం బయటకు రావడం ఏంటి. ఇదే విషయంపై ఇప్పుడు అందరిలోను అనుమానాలు కలుగుతున్నాయి.
ట్రెజరీలో వెండి కిరీటం, బంగారు కిరీటాలు, హారం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. 2017 సంవత్సరం ఈ వ్యవహారం జరిగితే అప్పట్లో టిటిడి ట్రెజరీలో ఎఈఓగా ఉన్న శ్రీనివాసరావు జీతం నుంచి మొత్తం డబ్బులను వసూలు చేయడం ప్రారంభించారు. ఇలా రెండేళ్ళు వసూలు చేశారు. ఇంకా వసూలు చేస్తూనే ఉన్నారు.
అయితే కాలపరిమితి అయిపోతూ వస్తుండటంతో ఆ ఉద్యోగి బిజెపి నేతలను ఆశ్రయించాడు. తన జీతం మొత్తం టిటిడినే తీసేసుకుంటోందని చెప్పాడు. దీంతో ఆ వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. ఇదంతా జరుగుతుండగానే టిటిడిలో మరోసారి కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎఈఓ శ్రీనివాసులు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో ఆభరణాలు కనిపించకుండా పోతే అప్పట్లో ట్రెజరీలో ఉన్న మరికొన్ని ఆభరణాలను పరిశీలించారు.
అయితే కొత్త ఆభరణాలు బయటకు వచ్చాయి. దీంతో టిటిడి అధికారులు ఆశ్చర్యపోయారు. ఉండాల్సిన ఆభరణాలు లేకుండా కొత్త ఆభరణాలు ఎలా వచ్చాయో అస్సలు టిటిడి అధికారులకు అర్థం కాలేదట. అయితే వాటి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని టిటిడి అధికారులు భావిస్తున్నారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారంటూ వాదనలు వస్తున్నాయి. అయితే ఈ నగలు ఎలా వచ్చాయో తెలియక జుట్టు పీక్కుంటున్నారు టిటిడి ట్రెజరీ సిబ్బంది. తమకు తెలియకుండా, రిజిస్ట్రర్లో రాయకుండా నగలు ఎలా చేరాయోనని ఆలోచనలో పడిపోయారు. ఇదేమైనా కలియుగ దైవం లీలేమో చూడాల్సిందే.