దండి సత్యాగ్రహానికి నేటితో 91 ఏళ్లు

మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (15:42 IST)
1930 ఏప్రిల్ 6న అరేబియా సముద్ర తీరంలోని దండిలో పిడికెడు ఉప్పును చేతిలోకి తీసుకుని.. బ్రిటిష్‌ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు సగర్వంగా ప్రకటించారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో మహోజ్వల ఘట్టమిది. 
 
 స్వేచ్ఛ, స్వాతంత్య్రం, స్వపరిపాలన, స్వీయ నిర్ణయాలు.... ఇలాంటి పెద్దపెద్ద మాటలు సామాన్యుడికి ఏం అర్థమవుతాయి? కానీ ఈ మహోన్నత లక్ష్యాలను అందుకోవాలంటే అదే సామాన్యుడు పోరాటం చేయక తప్పదు. మరి వారిని కార్యోన్ముఖుల్ని చేయాలంటే ఏం చేయాలి?.. ఇవీ మహాత్మా గాంధీ మదిని తొలుస్తున్న ఆలోచనలు..!

ఆ కార్యసాధకుని కళ్ల ముందు కనిపించింది అద్భుత ఆయుధం. సాధారణ ఉప్పు. ఆ ఉప్పునే నిప్పు కణికగా మార్చి పోరు బాటన సాగడానికి మహాత్ముడు వ్యూహం రచించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఉప్పుపై పన్నును భారీగా పెంచింది. దాని తయారీపైనా ఆంక్షలు పెట్టింది. మన నోట్లో మట్టికొట్టే ఈ నిర్ణయం ఒక్కటి చాలు.. బ్రిటిష్‌ ప్రభుత్వం ఎందుకు వద్దో ప్రజలకు తెలియజెప్పడానికి! పోరులో వారిని భాగస్వాములను చేయడానికి!!
 
 ఏప్రిల్‌ ఆరో తేదీ ఉదయం 6.30 గంటలకు మహాత్ముడు దండిలో పిడికెడు ఉప్పును పట్టుకొని బ్రిటిష్‌ సామ్రాజ్య పునాదులు కదిలిస్తున్నట్టు ప్రకటించారు. అప్పటికే ఆయన పాదయాత్ర ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో ఎంతో మంది పాత్రికేయులు అక్కడికి చేరుకున్నారు. న్యూస్‌ రీళ్లూ తీశారు. దాదాపు అర లక్ష మంది ప్రజలు వచ్చారు. ‘రఘుపతి రాఘవ రాజారాం’ భజనతో ఆ ప్రాంతం మార్మోగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు