ఆర్కే బీచ్‌లో ఎవ్వరికీ అనుమతి లేదు : డీజిపి, అక్కడికొస్తే పవన్‌, జగన్లను అరెస్టు చేస్తారా?

మంగళవారం, 24 జనవరి 2017 (17:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అధికార తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రత్యేక హోదా అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, మరోవైపు కాపులను బీసీలలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ నెల 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకు కాపు జేఏసీ పాదయాత్ర నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే కాపు సత్యాగ్రహ యాత్ర పేరిట జరుగుతున్న ఈ యాత్రకు అనుమతిలేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ ఇప్పటికే ప్రకటించారు. 
 
అనుమతి లేకపోతే పాదయాత్ర చేపట్టనివ్వమని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్ర నేపథ్యంలో జిల్లా అంతటా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్టు కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ వెల్లడించారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు, ధర్నాలు ప్రత్యక్ష ప్రచారాలపై నిషేధం విధించినట్లు కలెక్టర్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనని ఆందోళన పోలీసులలోను, పాలకుల్లోను ఉంది. పాదయాత్రకు ముందే ముద్రగడను గృహ నిర్భంధం చేసే అవకాశం లేకపోలేదు. 
 
ఈ క్రమంలో కాపు సామాజిక వర్గం ఏవిధంగా స్పందిస్తుందో అనే భయం ప్రభుత్వంలో ఇప్పుడు చోటుచేసుకుంది. ఇది ఇదిలావుండగా జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో ఆ మరునాడే అంటే జనవరి 26వ తేదీన వైజాగ్‌లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ యువత పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆ మౌన పోరాటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తను మద్దతునిస్తున్నట్లు ప్రకటించడం, మరికొందరు సినీ నటులు ఈ ఉద్యమానికి పవన్ బాటలో మద్ధతు పలుకుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 
 
ఈ అవకాశాన్ని ప్రతిపక్షనేత జగన్ సైతం అందిపుచ్చుకొని వివిధ పద్ధతులలో నిరసనలు తెల్పాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఐతే ఈ కార్యక్రమానికి కూడా అనుమతి లేదని పోలీసు శాఖ ప్రకటించింది. పై రెండు సంఘటనలు ముఖ్యమంత్రికి శిరోభారంగా తయారయ్యాయి. ఈ రెండు సున్నిత అంశాలు కావడంతో ఏమాత్రం అటుఇటు అయినా తీవ్రమైన పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించలేని పరిస్థితి నెలకొంది. కాపుల మనోభావాలను, యువకుల ప్రత్యేక హోదా సెంటిమెంట్‌కు భంగం వాటిల్లకుండా ఈ పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రభుత్వం పావులు కదుపుతుందని సమాచారం.
 
ఇదిలావుంటే ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం నిరసన తెలిపేందుకు పవన్ కళ్యాణ్‌తో సహా ఎవ్వరికీ అనుమతి లేదని డీజీపి సాంబశివరావు వెల్లడించారు. ఇంత తక్కువ సమయంలో తాము తీసుకోవాల్సిన ఏర్పాట్లు సాధ్యం కావనీ, అందువల్ల ఎవ్వరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని చూసి ఎవ్వరూ సమూహాలుగా గుమిగూడవద్దని హెచ్చరించారు.

శాంతియుత నిరసనలకు తాము ఎలాంటి అడ్డంకి సృష్టించబోమనీ, ఐతే ఏ సమావేశానికైనా బాధ్యత వహించేవారు ముందుకు వస్తే పరిశీలించి తదనుగుణంగా అనుమతి ఇస్తామని చెప్పారు. ఐతే ప్రత్యేక హోదా కోసం నిరసన చేసే యువతకు తాము మద్దతునిస్తామని పవన్, జగన్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో జనవరి 26న పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ ఆర్కే బీచ్ వైపు వెళ్తే వారిని అరెస్టు చేసే అవకాశం లేకపోలేదు.

వెబ్దునియా పై చదవండి