ఆధ్యాత్మిక పర్యటనలో జనసేనాని.. ఎందుకో తెలుసా? (Video)

సోమవారం, 14 మే 2018 (21:47 IST)
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బిజీబిజీగా గడుపుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు ప్రశాంతత కోరుకున్నట్లున్నారు. ప్రజల మధ్య ఎప్పుడూ తిరుగుతూ ప్రత్యేక హోదా ఉద్యమం కోసం అలుపెరగని పోరాటం చేసిన పవన్ కళ్యాణ్‌ గత రెండురోజుల నుంచి తిరుమల గిరులలోనే సేదతీరుతున్నారు. అది కూడా సామాన్య భక్తుడిలాగా మఠంలో. సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరైన జనసేనాని అత్యంత సామాన్యుడిలా తిరుమలలో గడపడం.. అందులోను ప్రశాంతత కోరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
 
ఈ నెల 15వ తేదీ నుంచి బస్సు యాత్ర ప్రారంభించేందుకు సిద్థమయ్యాడు పవన్ కళ్యాణ్‌. ఇప్పటికే శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్‌ తెలిపారు. అయితే బస్సు యాత్రకు రెండురోజుల ముందు తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు పవన్. పి.కె.టూర్ అసలు తిరుపతిలో ఉంటుందని ఆ పార్టీ క్యాడర్‌కే తెలియదు. ఉన్నట్లుండి పవన్ కళ్యాణ్‌ తిరుపతిలో ప్రత్యక్షమై ఒక మఠంలో సేద తీరుతున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడమ కాకుండా ఆంజనేయస్వామి పుట్టినట్లుగా ఆధారాలు ఉన్న జపాలీ తీర్థంను సందర్సించారు పవన్ కళ్యాణ్‌. తన గదిలోనే యోగా చేసుకుంటూ ప్రశాంతంగా ఒక్కరే గడుపుతున్నారు పవన్.
 
అభిమానులెవరితోను ఇప్పుడు మాట్లాడడం లేదట. స్వామివారి దర్శనం తరువాత కూడా ఆయన రాజకీయాల గురించి మాట్లాడలేదు. తనకు అన్నప్రాసన, నామకరణం చేసింది తిరుమలలోని యోగ నరసింహస్వామి ఆలయం నుంచి అనీ, అందుకే తిరుమలకు వచ్చానని చెప్పారు పవన్ కళ్యాణ్‌. అనుకున్న సమయం కన్నా ఆలస్యంగానే పవన్ బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర ప్రారంభిస్తే మూడు, నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. అందుకే ఇప్పుడే ప్రశాంతత కోసం పవన్ కళ్యాణ్‌ ఆధ్యాత్మిక క్షేత్రాలను తిరుగుతున్నట్లు తెలుస్తోంది. వీడియో చూడండి...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు