బీజేపీ-వైసీపీ కలిసి పనిచేయబోతున్నాయా? ప్రశాంత్ కిషోర్ టీమ్ ఏమంది?

ఆదివారం, 18 మార్చి 2018 (15:20 IST)
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, నరేంద్ర మోదీ వెన్నంటి వుండిన అపర చాణక్య ప్రశాంత్ కిషోర్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా మారడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోర్ వున్నాడనే ధైర్యంతోనే టీడీపీని బీజేపీ పట్టించుకోలేదని టాక్ వస్తోంది. ఎన్నికల వ్యూహకర్తగా వున్న ప్రశాంత్ కిషోర్ ఎటు వుంటే అటే విజయం ఖాయం. 
 
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగుతోంది. మొన్నటి వరకు వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగానే కిషోర్ అందరికీ తెలుసు. అయితే బీజేపీ చీఫ్ అమిత్‌షా.. తమ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటూ ప్రకటించడంతో ఇక తెలుగుదేశం పార్టీని వదిలించుకునేందుకు బీజేపీ సిద్ధమైపోయిందని జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ప్రశాంత్ కిషోర్ వ్యూహం ప్రకారమే బీజేపీ-వైసీపీ కలిసి పనిచేయబోతున్నాయని సంకేతాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ మొదట వైసీపీ వ్యూహకర్తగా కిషోర్‌ను రంగంలోకి దించారని సమాచారం. ప్రశాంత్ కిషోర్ అండ్ టీమ్ ఏపీ రాజకీయాలపై ఇప్పటికే ఓ నివేదిక కూడా ఇచ్చేసిందని ప్రచారం సాగుతోంది. 
 
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రజల మధ్య క్రేజ్ తగ్గిందని.. ప్రజలంతా వైసీపీ చూస్తున్నారనే విషయాన్ని ప్రశాంత్ కేంద్రానికి చేరవేశారని.. దీన్ని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ బాబును వదిలి జగన్‌ను పట్టుకుందని టాక్ వస్తోంది. అందుకే టీడీపీని నమ్ముకుంటే ఏపీలో రాజకీయ మనుగడ కష్టమని భావించిన బీజేపీ, వైసీపీకి దగ్గరవుతుందని సమాచారం.  
 
అయితే 2019 ఎన్నికల్లో వైకాపా గెలుపు కోసం కృషి చేస్తున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, బీజేపీ నేతలను ఢిల్లీలో కలిశారని వచ్చిన వార్తలను ఆయన సంస్థ ఐ-ప్యాక్ ఖండించింది. శనివారం నాడు ప్రశాంత్ కిషోర్ అసలు ఢిల్లీలోనే లేరని.. అలాంటప్పుడు ఏపీ బీజేపీ నేతలతో కలిసి.. అమిత్ షాను ఎలా కలుస్తారని ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నించింది. కాగా అమిత్ షాను కలిశారనడం అవాస్తవమని, ఇటువంటి అవాస్తవ కథనాలను ప్రసారం చేయడం, ప్రచురించడం ద్వారా ఏం సాధిస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు