అరటి పువ్వుతో కట్‌లెట్ తయారీనా? ఎలా?

బుధవారం, 18 జులై 2018 (13:09 IST)
అరటి పండు పువ్వుతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అర‌టి పువ్వును తినడం ద్వారా స్త్రీల‌కు రుతుక్ర‌మం సక్రమంగా ఉంటుంది. బాలింతలకు మంచి ఆహారం. ఇందులో చాలా పోష‌కాలు ల‌భించ‌డం వ‌లన అటు త‌ల్లికి, ఇటు శిశువుకు కూడా మంచి చేస్తుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు అర‌టిపువ్వు త‌ర‌చుగా తీసుకుంటే వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు క్ర‌మంగా త‌గ్గిపోతాయి. మరి ఇటువంటి అరటి పువ్వుతో కట్‌లెట్ ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు: 
అరటి పువ్వు తరుగు - 2 కప్పులు 
ఉల్లి తరుగు - అరకప్పు
ఉడికించిన బంగాళదుంప గుజ్జు -1 కప్పు
అల్లం - అంగుళం ముక్క 
పచ్చిమిర్చి - 2 
మిరియాల పొడి - 1 స్పూన్ 
కరివేపాకు - 4 రెబ్బలు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
గరం మసాల - 1 స్పూన్ 
ఉప్పు - రుచికి తగినంత
గుడ్డు - 1 
బ్రెడ్‌ పొడి - తగినంత
నూనె - వేగించడానికి సరిపడా
పసుపు - చిటికెడు.
 
తయారుచేసే విధానం: 
ముందుగా అరటి పువ్వు తరుగును బాగా కడిగి తగినన్ని నీటిలో చిటికెడు ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. ఇప్పుడు నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర తరుగును వేసి బాగా వేగించాలి. తరువాత గరం మసాల, మిరియాలపొడి, ఉప్పు, ఉడికించిన పువ్వు తరుగు, బంగాళదుంప గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. నిమిషం తరువాత దించేసి చల్లారనివ్వాలి. ఈ ముద్దను కట్‌లెట్స్‌గా చేసుకుని గిలకొట్టిన గుడ్డులో ముంచి బ్రెడ్‌ పొడిలో కలుపుకొని నూనెలో దోరగా వేగించాలి. గుడ్డు ఇష్టపడనివారు మైదా జారును వాడవచ్చును. అంతే అరటి పువ్వు కట్‌లెట్ రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు