గార్లిక్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడం ఎలా?

శనివారం, 9 ఫిబ్రవరి 2013 (15:25 IST)
FILE
గార్లిక్‌తో మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు.. ఆరోగ్యనిపుణులు. శరీరంలో రక్తప్రసరణను సక్రమంగా ఉంచడంలో వెల్లుల్లిపాయల పాత్ర కీలకం. వెల్లుల్లిని కూరల్లో అధికంగా వాడటం ద్వారా జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. అలాంటి గార్లిక్‌తో రైస్ తయారు చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేయండి.

కావాల్సిన పదార్థాలు:
బాస్మతి బియ్యం : కప్పు
బటర్ - 3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి - 15
ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి)
క్యాబేజీ తరుగు - పావు కప్పు
బ్రొకోలి - పావు కప్పు
ఎండు మిర్చి - 5 (మధ్యకు విరావాలి)
అజినమోటో - పావు టీ స్పూన్
నూనె - టేబుల్ స్పూన్
జీడిపప్పు పలుకులు - తగినన్ని
తాలింపు దినుసులు - తగినన్ని
బేబీకార్న్ - (4 ముక్కలు చేయాలి)
వేయించిన వెల్లుల్లి రెబ్బల తరుగు - 3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం :
ముందుగా బియ్యాన్ని కడిగి, అరగంట నానబెట్టి, తర్వాత నీళ్లు లేకుండా వడకట్టాలి. స్టౌ మీద పాన్ పెట్టి 3 కప్పుల నీళ్లు పోసి మరిగించి, అందులో బియ్యం వేసి ఉడికించాలి. అన్నం పూర్తిగా ఉడికాక, ప్లేట్‌లోకి తీసుకొని ఆరనివ్వాలి. అందులో బటర్, ఉప్పు వేసి కలిపాలి. పాన్‌లో నూనె, బటర్ వేసి కాగాక, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించాలి.

ఉల్లిపాయలు గోధుమరంగు వచ్చేవరకు వేగాక.. బేబీ కార్న్ ముక్కలు, క్యాబేజీ తరుగు, అజినమోటో వేసి, కొన్ని నిమిషాల పాటు వేయించాలి. ఈ మిశ్రమంలో ఉప్పు, అన్నం వేసి కలిపి, 10- 15 నిమిషాలు ఉంచి, చివరిగా వేయించిన వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పుతో గార్నిష్ చేయాలి. ఈ గార్లిక్ ఫ్రైడ్ రైస్‌ను కడాయి పనీర్, కడాయి చికెన్‌తో సర్వ్ చేస్తే రుచికరంగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి