రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు దేశం నలుమూలల నుంచి సుమారు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా కాగా, ఇందుకు తగ్గట్టు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరఫున మంత్రి మాణిక్యాలరావు, స్పీకర్ కోడెల పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. పోలీసు భద్రత కూడా కల్పించారు.
ఇకపోతే, శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, అమరావతిలతో పాటు భీమేశ్వరం, కాళేశ్వరం తదితర శైవక్షేత్రాల్లో ఇసుకేస్తే రాలనంత భక్తులు కనిపిస్తున్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత సోమస్కంధమూర్తి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
అలాగే, యనమలకుదురు రామలింగేశ్వర ఆలయం, కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లిలోని దుర్గా నాగేశ్వరస్వామివారి ఆలయం, విజయవాడ వన్ టౌన్‌లోని శివాలయం, గుంటూరు జిల్లా సత్రశాల, ప్రకాశం జిల్లా పునుగోడు తదితర ప్రాంతాల్లోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.