''ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్'' అనే మహామృత్యుంజయ మంత్రాన్ని మహాశివరాత్రి రోజున పఠిస్తే అనుకున్న కార్యాలు విజయంవంతంగా పూర్తవుతాయి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పునర్జన్మంటూ వుండదు. మహాశివరాత్రి రోజున ''ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి.. తన్నో రుద్ర: ప్రచోదయాత్'' అనే శివ గాయత్రి నామంతో శివునిని పూజించే వారికి సకలసంపదలు చేకూరుతాయి.
ఈ మంత్ర జపంతో శివుని అనుగ్రహం పొందవచ్చు. ఈ రెండు మంత్రాలను శివరాత్రి రోజున 108 సార్లు జపించినట్లైతే దీర్ఘాయువు, ఆరోగ్యం చేకూరుతుంది. ప్రశాంతత, ఆనందం చేకూరుతుంది. భయం తొలగిపోతుంది. శరీరానికి బలం చేకూరుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. మహాశివరాత్రి రోజునే కాకుండా ఓ రోజైనా పగలు లేదా రాత్రి పూట ఈ మంత్ర జపంతో పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు.
ఒత్తిడి, విచారం, అనారోగ్యం, ఆకస్మిక మరణ భయం తొలగిపోతుంది. శివరాత్రి రోజున జాగారం చేయడం.. ఆలయాల్లో జరిగే పూజలో పాల్గొనడం ద్వారా ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. మహాశివరాత్రి రోజున నదీ స్నానం చేయడం ద్వారా పుణ్యఫలితం దక్కుతుంది. ఉపవాసం వున్నవారు రోజంతా పండ్లు, పాలు తీసుకుని, ఒంటి పూజ భోజనం చేయవచ్చు. సమీపంలోని శివాలయాలకు వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకోవడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.