వాల్మీకి తపస్సుతో ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు.
చూసి పరవశానికి గురవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు
ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి. ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం.
24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశం పవిత్రంగా భావిస్తుంది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు- భక్తుడు – వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో కళ్లకు కట్టినట్లు వాల్మీకి మహర్షి రచించారు. ఈ కావ్యం. మానవాళికి ఎంతో అవసరం.