పతనావస్థలో అమెరికా బ్యాకింగ్ వ్యవస్థ!?

ఆదివారం, 19 మార్చి 2023 (11:21 IST)
అగ్రరాజ్యం అమెరికాలో బ్యాకింగ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి కనిపిస్తుంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంకు తరహాలో ఆ దేశంలోని మరికొన్ని బ్యాంకులు కూడా దివాళా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో దాదాపుగా 186 బ్యాంకులు ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఓ నివేదిక హెచ్చరించింది. 
 
భారీగా పెరిగిన ఫెడ్ రేట్లతో పాటు బీమా కవరేజీ లేని డిపాజిట్లే అధికంగా ఉండటంతో ఈ బ్యాంక్‌లూ రిస్క్ జోన్‌లో ఉన్నాయని సోషల్ సైన్స్ రీసెర్చ్ నెట్వర్క్ పోస్ట్ చేసిన పరిశోధన నివేదిక పేర్కొంది. అమెరికాలో బ్యాంక్ దివాళా పరిష్కార ప్రక్రియ నిబంధనల ప్రకారం.. ఎఫ్ఐసీ నుంచి బీమా కవరేజీ కలిగిన డిపాజిట్ లోనూ 2.5 లక్షల డాలర్ల వరకే సొమ్ము తిరిగి లభిస్తుంది. అంతకు మించిన డిపాజిట్ సొమ్మును నష్టపోవాల్సిందే. 
 
ఈ 186 బ్యాంక్‌ల నుంచి బీమా కవరేజీ లేని డిపాజిట్లలో సగం ఉపసంహరించుకున్నా అవి కుప్పకూలవచ్చని రిపోర్టు పేర్కొంది. ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంక్లు కుప్పకూలిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను రక్షించడంతో పాటు ప్రజల్లో విశ్వాసం నింపేందుకు అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఆ రెండు బ్యాంకుల డిపాజిటర్ల సొమ్ముకు పూర్తి రక్షణ కల్పించేలా, పన్ను చెల్లింపుదారులు ఏమాత్రం నష్టపోకుండా. బ్యాంక్ దివాళా సమస్యను పరిష్కరించనున్నట్లు బైడెన్ సర్కారు ప్రకటించింది. అయితే, కొన్ని బ్యాంకులు వరుసగా దివాళా తీస్తే మాత్రం డిపాజిట్‌దార్లకు ప్రభుత్వం కూడా రక్షణ కల్పించలేదని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు