వయ వందన యోజన పథకం పొడగింపు.. ఇందులో చేరితే రూ.10 వేలు!
శుక్రవారం, 19 మార్చి 2021 (10:08 IST)
ప్రధానమంత్రి వయ వందన యోజనా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరేందుకు నిర్ణీత గడువు విధించింది. అయితే, ఈ గడువు మార్చి 31వ తేదీతో ముగియనుంది. క్రమంలో మరో మూడేళ్లపాటు పొడగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది.
ఈ స్కీమ్‌లో కొత్తగా చేరాలనుకునేవారికి 2023 మార్చి 31 వరకు అవకాశం ఉంది. 60 ఏళ్ళు పైబడిన వృద్ధుల కోసం పెన్షన్ ద్వారా అసరా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రధాన మంత్రి వయ వందన యోజన పెన్షన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్‌లోనే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఇందులో చేరిన వారికీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 7.4 శాతం వడ్డీని ప్రకటించింది.
ప్రతీ ఏడాది కేంద్ర ప్రభుత్వం వడ్డీని నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ వివరాలను చేస్తోంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ద్వారా ఈ స్కీమ్‌కు దరఖాస్తు తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి.
దీని ద్వారా పెన్షన్ పొందాలనుకునే వారు రూ.1,56,658 నుంచి రూ.15,66,580 లోపు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో పెట్టిన పెట్టుబడిని బట్టి నెలకు రూ.1,000 నుంచి రూ.10,000 మధ్య వడ్డీ రూపంలో పెన్షన్ పొందొచ్చు.
నెలకు రూ.10,000 పెన్షన్ కావాలనుకునే వారు రూ.15,66,580 పెట్టుబడి పెట్టాలి. ఈ స్కిమ్ గడువు వ్యవధి 10 ఏళ్లు. 10 ఏళ్లు పూర్తైన తర్వాత పెట్టుబడి మొత్తం తిరిగివస్తుంది.
ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్‌లో చేరడానికి కనీస వయస్సు 60 ఏళ్లు కాగా గరిష్ట పరిమితి లేదు. ఈ స్కీమ్‌లో చేరిన వారికి నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 కనీస పెన్షన్ లభిస్తుంది.
ఏడాదికి రూ.12,000 పెన్షన్ పొందాలనుకుంటే రూ.1,56,658 పెట్టుబడి పెట్టాలి. ప్రతి నెల రూ.10,000 పెన్షన్ కావాలంటే రూ.15,66,580 ఇన్వెస్ట్ చేయాలి. పాలసీ ప్రారంభించి మూడేళ్లు పూర్తైన తర్వాత గరిష్టంగా 75 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. వడ్డీ ఏడాదికి 10 శాతం చెల్లించాలి.
ఒకవేళ 10 ఏళ్లు పూర్తికాక ముందే పెట్టుబడి పెట్టిన వ్యక్తి చనిపోతే పెట్టుబడి మొత్తం వారి జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా నామినీకి వస్తాయి. 10 ఏళ్ల గడువు పూర్తికాక ముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98 శాతం మాత్రమే వెనక్కి వస్తుంది.