ఐస్‌క్రీంను ఎవరు కనుగొన్నారు..?

FILE
పేద, ధనిక.. చిన్నా, పెద్దా.. తేడాలు లేకుండా అందర్నీ ఊరించే పదార్థం ఐస్‌క్రీం. మండువేసవిలో తియ్యగా, చల్లగా అలరించే ఐస్‌క్రీం రుచిని ఆస్వాదించని వారెవరూ ఉండరు. అయితే మొట్టమొదటిసారిగా ఈ ఐస్‌క్రీంను ఎవరు కనుగొన్నారు, దీన్ని ఎవరు తయారు చేశారు, అసలు ఇదెలా పుట్టింది..? లాంటి విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం.

ఐస్‌క్రీం అనే పదార్థాన్ని మిగిలిన వంటల్లాగా ఎవరూ తయారు చేయలేదు. ఇది ఏ వంటగాడి చేతిలోనూ రూపుదిద్దుకోలేదు. పూర్వం రాజులు, జమీందార్లు, ధనవంతులు, సంపన్న వర్గాల ప్రజలు మత్తుపానీయాలను ఐస్‌తో చల్లబరిచి తీసుకునేవారు. ఆ తరువాత ఈ విధానమే ఐస్‌క్రీం తయారీకి ప్రేరణగా నిలిచిందని చెప్పవచ్చు.

ఇందులో భాగంగానే ఇంగ్లండ్ రాజ భవనంలో పనిచేసే వంటవాడు చల్లని ఓ పదార్థాన్ని తయారుచేసి రాజుకు వడ్డించాడట. అది భుజించిన రాజు దాని రుచికి ముగ్ధుడయ్యాడట. ఆ పదార్థమే ఐస్‌తో తయారైన ఐస్‌క్రీం. అయితే ఈ పదార్థం తయారీ రహస్యాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆ వంటవాడి వద్ద ఇంగ్లండ్ రాజు మాట తీసుకుని, ఆ వంటవాడికి సంవత్సరానికి కొంత మొత్తం డబ్బును ముట్టజెప్పేవాడట.

అలా కాలం గడుస్తుండగా డబ్బుకు ఆశపడిన ఆ వంటవాడు ఐస్‌క్రీం తయారీ రహస్యాన్ని యూరోపియన్లకు వెల్లడి చేశాడట. అలా వంటవాడి ద్వారా యూరోపియన్లకు, వారి ద్వారా అమెరికన్లకు ఐస్‌క్రీం తయారీ రహస్యం వెలుగులోకి వచ్చింది. తదనంతరం న్యూజెర్సీకి చెందిన నాన్సీ జాన్సన్ అనే మహిళ సులభ పద్ధతిలో ఐస్‌క్రీంను తయారుచేసే చేతి మిషన్‌ను కనుగొంది. ఆ తరువాత ఐస్‌క్రీం తయారీ సులభంగా అందరికీ అందుబాటులో వచ్చింది.

ఆ తరువాత బాల్టిమోర్‌కు చెందిన జాకబ్ ఫన్సల్ తొలిసారిగా ఐస్‌క్రీం పార్లర్‌ని ప్రారంభించారు. ఆపై డెమాస్కన్ నుంచి వచ్చిన సిరియా దేశస్థుడు ఏ. హాంని ఐస్‌క్రీంలను కోన్‌లలో అమ్మటం ప్రారంభించాడు. అలా కొంతకాలం గడచిన తరువాత ఆవిరి, విద్యుత్‌శక్తులతో ఐస్‌క్రీంలను తయారు చేసే విధానం అభివృద్ధి చెందింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బుర్టన్ బుచ్ బాస్కిన్ అనే వ్యక్తి తొలిసారిగా 31 రకాల ఐస్‌క్రీంలను తయారు చేశాడు. అలా చాక్లెట్, వెనీలా, స్ట్రాబెర్రీ రుచులు ప్రపంచానికి బాస్కిన్ ద్వారా పరిచయం అయ్యాయి. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా ఐస్‌క్రీం అనేక ఆధునిక పోకడలతో ప్రపంచ ప్రజలందరినీ చల్లచల్లగా అలరిస్తూనే ఉంది.

వెబ్దునియా పై చదవండి