ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం 2024 జూన్‌తో ముగిసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపికపై పార్టీలో విస్తృత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ అగ్రనాయకత్వం మహిళా నేత వైపై మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ కీలక పదవి కోసం పలువురి పేర్లు పరిశీలనలో ఉండగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, తమిళనాడుకు చెందిన బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాస్ పేర్లు బలంగా వినిపిస్తున్నట్టు ఢిల్లీ బీజేపీ వర్గాల సమాచారం.
నిర్మలా సీతారామన్‌కు కేంద్ర మంత్రిగా పార్టీలో సీనియర్ నేతగా అపారమైన అనుభవం ఉంది మరోవైపు, బహుభాషా కోవిదురాలైన పురంధేశ్వరి నియామకం ద్వారా దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పార్టీని బలోపేతం చేయొచ్చని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. తమిళనాడులో క్షేత్రస్థాయి నుంచి ఎదిగిన వానతి శ్రీనివాసన్ పేరును కూడా పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారు.
ఇటీవలి ఎన్నకల్లో మహిళా ఓటర్లు బీజేపీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించడం వంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ అత్యున్నత పదవిని మహిళకు ఇవ్వడం ద్వారా స్పష్టమైన సందేశం పంపాలని బీజేపీ వ్యూహాత్మకంగా యోచిస్తోంది. ఒక వేళ ఇదే జరిగితే బీజేపీ చరిత్రలో ఒక మహిళ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం ఇదే ప్రథమం.