ముట్టుకుంటే... అలా ముడుచుకుంటావేం..?

పిల్లలూ... "టచ్ మీ నాట్" అనే మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా..? తెలుగులో "అత్తిపత్తి" అని పిలిచే ఈ మొక్క శాస్త్రీయ నామం "మైమోసా పూడికా". ఇందులో పూడికా అంటే సిగ్గు అని అర్థం. ఈ టచ్ మీ నాట్ కథా కమామీషేంటో.. ఈరోజు తెలుసుకుందామా...?!

ఏదేని స్పర్శ తగలగానే ముడుచుకునే లక్షణం కలిగిన ఈ టచ్ మీ నాట్ మొక్క... తన ఆత్మరక్షణ ప్రక్రియలో భాగంగా అలా చేస్తుందన్నమాట. ఉన్నట్టుండి ఈ మొక్క ఆకులన్నీ ముడుచుకుపోవటాన్ని చూసిన ఏ జంతువయినా సరే, తినకుండా పక్కకి వెళ్లిపోతాయి. దీంతో ఇది తనను కాపాడుకుంటుంది.

టచ్ మీ నాట్ మొక్క ఆకులు, పత్ర వృంతాల్లోని (స్టాల్క్స్) కణజాలాలలో నిండుగా నీరుంటుంది. అలాంటప్పుడు ఇవి నిటారుగా ఉంటాయి. ఏదేని స్పర్శ తగిలినప్పుడు, కాంతి తగ్గినప్పుడు, కొన్ని రసాయనిక ప్రక్రియల కారణంగా ఈ ఆకుల కణజాలాల్లోని నీరు స్థానభ్రంశం చెందుతుంది.

అలా నీటిని పోగొట్టుకున్న ఈ టచ్ మీ నాట్ ఆకులు గాలి తీసేసిన బుడగల్లాగా చటుక్కున ముడుచుకుంటాయి. మిగతా మొక్కల ఆకుల్లో ఈ నిర్మాణం ఉండదు కాబట్టి అవి వీటిలాగ ముడుచుకుపోవు. సో.. దీన్నిబట్టి ఈ "టచ్ మీ నాట్" మొక్క ఎందుకలా ముడుచుకుపోతుందో ఇప్పటికి అర్థమయ్యింది కదూ పిల్లలూ...!

వెబ్దునియా పై చదవండి