హిమాలయాల వయస్సెంతో తెలుసా...?

పిల్లలూ.. ఆసియా ఖండానికే తలమానికంగా నిలచిన "హిమాలయా పర్వతాల" వయస్సు ఎంతో మీకు తెలుసా..? ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాలుగా పేరుగాంచిన ఈ హిమాలయాల వయస్సును... ఇప్పటిదాకా చాలామంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నదానికంటే 50 లక్షల సంవత్సరాలు ఇంకా ఎక్కువగానే ఉండవచ్చునని తాజాగా భారత్, బ్రిటన్‌లకు చెందిన శాస్త్రవేత్తల బృందం వెల్లడిస్తోంది.

వివరాల్లోకి వస్తే... మన దేశానికి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన కె.ఎన్.కృష్ణ, బ్రిటన్‌కు చెందిన జాన్ బుల్, రోజర్ స్క్రట్టన్‌లు హిమాలయాల వయస్సుకు సంబంధించి పరిశోధనలు జరిపారు. వీరి ఉమ్మడి పరిశోధనల్లో తేలిందేంటంటే... 1.39 కోట్ల నుంచి 1.44 కోట్ల సంవత్సరాల మధ్య హిమాలయాల పర్వతాలు ఏర్పడి ఉంటాయని తెలిసింది.

ఇదిలా ఉంటే... ఇప్పటిదాకా 80 లక్షల సంవత్సరాల క్రితం హిమాలయా పర్వతాలు ఆవిర్భవించి ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే... తాజాగా భారత్, బ్రిటన్ పరిశోధకులు జరిపిన ఉమ్మడి పరిశోధనల అనంతరం మాత్రం హిమాలయాల వయస్సు ఇంకా ఎక్కువగా ఉండవచ్చన్న వాదనలకు బలం చేకూరినట్లయింది. కాబట్టి పిల్లలూ... భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమిని వేరుచేస్తుండే ఈ పర్వతపంక్తులు చాలా కాలం క్రితమే ఏర్పడినాయని అర్థమైంది కదూ..?!

వెబ్దునియా పై చదవండి