పిల్లలూ... మీరెప్పుడైనా "బ్లాక్ బక్" గురించి విన్నారా..? ఇవి పేరుకు "బ్లాక్ బక్"లయినా... చూసేందుకు అచ్చం లేళ్లలాగానే ఉంటాయట. ఆడవి, చిన్న మగవి మాత్రం పసుపు రంగులో ఉంటాయట. ఇరవై నుంచి ముప్పయి బ్లాక్ బక్‌లు కలిసి ఒక మందలాగా ఏర్పడి హాయిగా మైదాన ప్రాంతాలలో విహరిస్తుంటాయి.
ఎంచక్కా... పచ్చిక, రకరకాల గడ్డి, ఆకులు, పంటలను ఈ బ్లాక్ బక్‌లు గుటకాయ స్వాహా చేసేస్తుంటాయట. మరీ దట్టమైన కారడవుల్లో ఇవి కనిపించవు. బాగా బలంగా ఉండే మగ బ్లాక్ బక్ ఈ మందకు లీడర్‌గా ఉంటుంది. దానికి అందమైన ఒంపులు తిరిగిన రెండు కొమ్ములుంటాయి. ఏడాది వయస్సున్న మగ బ్లాక్ బక్‌కి నెమ్మదిగా కొమ్ములు మొలచుకొని వస్తాయట.
ప్రతి ఏడాదీ ఒక్కోసారి ఆడ బ్లాక్ బక్‌కి కూడా బుల్లి బుల్లి కొమ్ములు మొలచుకొని వస్తాయి. కానీ అవి మగవాటికి మళ్లే వంకర్లు తిరగవట. పైగా ఎంచక్కా పసుపు వర్ణంలో ఆకర్షణీయంగా మెరుస్తుంటాయి. అన్నట్టు పిల్లలూ... ప్రాణికోటిలో ఎక్కువ స్పీడ్‌గా పరిగెత్తితే ఫస్ట్ వచ్చేది చిరుతపులి అయితే, రెండోది బ్లాక్ బక్‌యేనట.
వీటికేదైనా ప్రమాదం ముంచుకొచ్చినట్లయితే మాత్రం.. బ్రహ్మాండంగా పరుగులు పెట్టేస్తాయట. ప్రాణ రక్షణ కోసం ఇవి 6 అడుగుల ఎత్తు మేరకు దుముకుతాయట. 18-20 అడుగులు గాల్లోంచి ఎగిరి కిందికి దూకుతాయట. నీల్గాయ్ (బ్లూ బుల్), చింకార కూడా ఈ బ్లాక్ బక్‌ల జాతికి చెందినవే అట పిల్లలూ... వినడానికి భలే తమాషాగా ఉంది కదూ..!