మలేరియాతో మటాషే

మంగళవారం, 30 జులై 2019 (08:24 IST)
మలేరియా అంటే అందరికీ తెలిసిన వ్యాధే. ఎలా వస్తుందో కూడా చాలా మందికి తెలుసు. కానీ దానిని దూరంగా ఉంచడానికి తీసుకోవలసిన జాగ్రత్తల్లోనే నిర్లక్ష్యం తాండవిస్తూ ఉంటుంది. అపరిశు భ్ర వాతావరణం, పర్యావరణంపై అశ్రద్ధ, పారిశుధ్యంపై నిరక్ష్యం వంటి కారణాలు దోమల ఉనికికీ, విస్తరణకూ, వ్యాప్తికీ మూలాలుగా మారుతున్నాయి. దోమలలో చాలా రకాలున్నా, వాటిలో ఆడ అనాఫిలస్‌ దోమకాటు వల్లే మలేరియా వ్యాపిస్తుంది.
 
జ్వరంగా మొదలై..
మలేరియా కారక దోమకాటుకు గురైన వ్యక్తిలో దాదాపు 10-15 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఈ వ్యాధిలో ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, చలి, వణుకు, వాంతులు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా ఏ జ్వరంలోనైనా కనిపించేవే. కేవలం వీటిని బట్టి మలేరియాను నిర్ధారించడం కష్టమే.

మాములు జ్వరమే కదా అని ఏ పారాసిటమాల్‌ టాబ్లెటో వేసుకుంటే అప్పటికి జ్వరం, ఇతర లక్షణాలు తగ్గినప్పటికీ రెండు మూడు గంటల వ్యవధిలో తిరిగి జ్వరం వస్తుంది. మలేరియా జ్వరం రాత్రి సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. జ్వరం ప్రారంభం కావడానికి ముందే బాగా చలి, వణుకు ఉంటాయి. ఒక అరగంట తర్వాత జ్వరం ప్రారంభమై, పెరుగుతూ ఉంటుంది. 106 డిగ్రీల ఫారెన్‌హీట్‌ దాకా (హై ఫీవర్‌) కూడా వస్తుంది. కొన్ని గంటల తర్వాత ఏ మందులు వాడకపోయినా జ్వరం దానికదే తగ్గిపోతుంది. ఈ జ్వరం తగ్గేటప్పుడు బాగా చెమటలు పడతాయి.

ఈ జ్వరంలో మూడు దశలున్నాయి. మొదటిది చలి, వణుకు దశ. రెండోది హై ఫీవర్‌. మూడోది చెమట పట్టడంతో జ్వరం తగ్గిపోయే దశ. జ్వరం తగ్గిపోయినట్లన్పించి, మళ్లీ తర్వాత రోజు ఈ మూడు దశల్లో జ్వరం వస్తుంది. అయితే అరకొర వైద్యం చేసుకుంటే ఈ దశలన్నీ కలిసిపోవచ్చు. చెమటలతో జ్వరం తగ్గి, కొంత విరామంతో మళ్లీ జ్వరం వస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

మలేరియాను క్లినికల్‌గా నిర్ధారించాలి. వ్యాధి సోకినట్లు తేలితే ప్రత్యేక చికిత్స చాలా అవసరం. కొన్నిరకాల మలేరియా వల్ల మెదడు, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటాయి. ఈ అవయవాలకు వ్యాధి సోకినట్టు లక్షణాలు కనిపిస్తే, అది 'ప్రమాదకరమైన మలేరియా'గా (ఫాల్సిఫారం అనే మలేరియా క్రిమి ద్వారా ఇది వస్తుంది) భావించాలి.
 
ఎలా వస్తుంది? 
ఎండలు తగ్గుముఖం పడుతూ, వర్షాలు మొదలైన సమయంలోనే దోమలు వృద్ధి చెందుతాయి. ఆ సమయంలో ఉన్న పొడి, తడి వాతావరణం దోమలు పెరగడానికి సహకరిస్తుంది. కాబట్టి మలేరియా వ్యాప్తి కూడా ఎక్కువవుతుంది. మలేరియా రోగిని దోమ కాటు వేసినప్పుడు ఆ దోమ జీర్ణాశయంలోకి మలేరియా సూక్ష్మజీవి చేరుకుంటుంది. అక్కడే ఒక వారం, రెండు వారాల్లో అవి వృద్ధి చెందుతాయి. ఈ దోమ మరో ఆరోగ్యవంతమైన వ్యక్తిని కాటేస్తే, అతనికీ మలేరియా సోకుతుంది. కొన్నిసార్లు రక్తమార్పిడి ద్వారానూ మలేరియా సోకుతుంది.
 
ఉచితంగా రక్త పరీక్ష 
జ్వరంతో బాధపడుతున్న రోగికి వచ్చింది మలేరియా వ్యాధా? కాదా? అని తెలుసుకోవడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా రక్త పరీక్ష చేస్తారు. మలేరియా తీవ్రంగా ఉన్నట్లన్పిస్తే ప్రత్యేకంగా నిర్ధారించడానికి యాంటిజెన్‌, స్మియర్‌ టెస్ట్‌లు తప్పనిసరిగా చేయించుకోవాలి. యాంటిజెన్‌ పరీక్షల్లో చాలా కచ్ఛితమైన ఫలితాలు వస్తాయి. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్‌ చాలా ప్రమాదకరమైన సెరిబ్రల్‌ మలేరియాకు కారణమవుతుంది.
 
దశల వారీగా చికిత్స
జ్వరం మలేరియా అని నిర్ధారణ అయినా సరే అది ఏ రకమైన మలేరియా అనే అంశం మీద ఆధారపడి, చికిత్స ఉంటుంది. సాధారణంగా ప్లాస్మోడియం వైవాక్స్‌ చికిత్సకు క్లోరోఫిన్‌ మందును వాడుతారు. మొదటి డోస్‌ ఇచ్చాక, రెండు గంటల విరామంతో సగం పరిమాణాన్ని రెండో డోస్‌గా ఇస్తారు. తర్వాత రెండురోజుల పాటు అదే డోసులో మందులిస్తారు.

తర్వాత 14 రోజుల పాటు ప్రైమోక్విన్‌ అనే మందును సిద్ధం చేసుకుని, పరిస్థితి ఎలా ఉందో ముందుగా ఒకసారి పరీక్షించి నిర్ధారించుకున్న తర్వాత, చికిత్స చెయ్యాల్సి ఉంటుంది. అయితే కొంత మందిలో క్లోరోఫిన్‌ మందు పనిచేయదు. దీనిని క్లోరోఫిన్‌ రెసిస్టెంట్‌ మలేరియా అంటారు. వీరికి రెండు మూడు రకాల కాంబినేషన్‌లో మందులు వాడాల్సి ఉంటుంది. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్‌ వల్ల కలిగే మలేరియాను సెరిబ్రెల్‌ మలేరియా అంటారు. ఈ రకమైన జ్వరానికి క్వినైన్‌ అనే మందు వాడతారు.
 
పూర్తిడోస్‌ వాడాలి
మలేరియా మందులు (క్లోరోక్విన్‌లు) మింగిన మొదటిరోజే మలేరియా క్రిములు చాలా వరకూ చనిపోతాయి. కానీ కొన్ని క్రిములు ఇంకా రెండు, మూడు రోజులు బతికి ఉంటాయి. వీటినీ మందులు వాడి, పూర్తిగా నిర్మూలించాలి. లేకపోతే ఈ బలమైన క్రిములు తప్పించుకుని, పెరిగి, మళ్లీ మలేరియాకు కారణమవుతాయి. ఇవి దోమల ద్వారా మళ్లీ ఇతరులకు వ్యాపించినప్పుడు, వైద్యానికి త్వరగా లొంగవు.

కాబట్టి మలేరియా మందులను పూర్తి డోసులో, పూర్తి కోర్సును వాడాలి. గర్భిణులు, చిన్న పిల్లల్లో మలేరియా వచ్చే అవకాశాలు మామూలు కంటే ఎక్కువగా ఉంటాయి. మలేరియా జ్వరం వల్ల కొన్నిసార్లు గర్భంలోనే బిడ్డ చనిపోయే అవకాశముంది. కాబట్టి క్లోరోక్విన్‌ లాంటి మందులు గర్భిణులు నిస్సందేహంగా డాక్టర్‌ సలహాపై వాడొచ్చు.
 
రాడికల్‌ ట్రీట్‌మెంట్‌ తప్పనిసరి
క్లోరోక్విన్‌ వాడిన తర్వాత ప్రైమాక్విన్‌ అనే మందును కూడా వాడటాన్ని 'రాడికల్‌ ట్రీట్‌మెంట్‌' అంటారు. మలేరియా క్రిములలో వైనాక్స్‌ క్రిమి దోమ కాటు ద్వారా మనిషి రక్తంలోకి ప్రవేశించిన తర్వాత అవి ఒకటి, రెండు వారాలయ్యాక కాలేయంలోకి వెళ్లి దాక్కొంటాయి. ఇవి అప్పుడప్పుడు బయటకు వచ్చి, మలేరియాను కలుగజేస్తాయి. క్లోరోక్విన్‌ మందు రక్తంలో ఉన్న క్రిములను మాత్రమే చంపుతుంది. ప్రైమాక్విన్‌ అనే మందు కాలేయంలో ఉన్న క్రిములనూ చంపుతుంది. ఈ రెండు మందులనూ వాడటాన్ని 'రాడికల్‌ ట్రీట్‌మెంట్‌' అంటారు.
 
నిర్లక్ష్యంతోనే సమస్య తీవ్రం
మలేరియాలో ముఖ్యంగా సెరిబ్రల్‌ మలేరియాలో ఎలాంటి నిర్లక్ష్యం పనికిరాదు. సెరిబ్రల్‌ మలేరియా ప్రమాదకరం. చాలా త్వరగా పరిస్థితి విషమిస్తుంది. దీనికి వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. ఈ రకమైన మలేరియా సోకిన రోగులు చాలా వరకు తమకు ఏం జరుగుతోందో చెప్పే పరిస్థితిలో ఉండరు.

మెదడు మీద దీని ప్రభావం ఉండడం వల్ల చాలా వరకు అయోమయంలో ఉంటారు. మాట తడబడుతుంది, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఈ మలేరియాను అశ్రద్ధ చేస్తే, రకరకాల ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. లివర్‌ ఫెయిల్యూర్‌, లంగ్‌ ఫెయిల్యూర్‌, కిడ్నీ ఫెయిల్యూర్‌ వంటి ప్రాణాంతక పరిస్థితికి ఇది కారణమౌతుంది.
 
దోమల నిర్మూలనే కీలకం
మలేరియాను అరికట్టాలంటే, ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలంటే ముందుగా చేయాల్సిన పని.. దోమల నిర్మూలన. దీనికోసం అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలి.
- వీలైనంత వరకూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందుతాయి కాబట్టి.. నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.
- ఏ ప్రాంతలోనైనా ఏడు నుంచి పది రోజులు నీరు నిల్వ ఉంటే అక్కడ దోమలు పుట్టే అవకాశముంది. కాబట్టి వెదురు బొంగులు, టైర్లు, పగిలిన బాటిళ్లు, పశువుల కాలి ముద్రలు, ప్లాస్టిక్‌ సంచులు, టెంకాయలు, పారేసిన పాత్రలు, బావులు, చిన్న చిన్న చెలమలు. వీటిలో నీళ్లు నిలిస్తే అవి దోమల వృద్ధికి కారణమవుతాయి. ఇంట్లో కానీ, ఇంటి చుట్టుపక్కల కానీ, ఇటువంటివి ఏవీ లేకుండా, వాటిలో నీరు నిలవ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- మొక్కల కుండీలు, పూల కుండీలలో నీళ్లు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.
- బావులు, చెలమలకు పూర్తిగా మూతలు పెట్టాలి.
- పంపుల వద్ద నిలిచే నీళ్లలో, మడుగుల్లో కిరోసిన్‌, వేస్ట్‌ ఆయిల్‌ చల్లితే దోమ లార్వాలు పెరగవు.
- ఎండాకాలంలో ఉపయోగించిన కూలర్లలోని నీటిని పూర్తిగా తీసేసి, పక్కన పెట్టాలి. వాటిలో నీళ్లు తీయడంలో అశ్రద్ధ చేస్తే అవే దోమలకు పుట్టినిళ్లుగా మారతాయి.
- దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు, వెంటిలేటర్లకు, టాయిలెట్ల పైపులకు దోమతెరలు అమర్చుకోవాలి.
- దోమలు ఉన్నాయనుకున్నపుడు క్రిమి సంహారక మందులు చల్లాలి.
- తగినన్ని దోమ తెరలు ఉపయోగించాలి. క్రిమి సంహారక పూత ఉన్న దోమతెరలైతే చాలా మంచిది.
- శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులను ధరించాలి. 
- వేప పొగపెట్టాలి. వేప నూనె, సిట్రెనెల్లా నూనె ఒంటికి రాసుకోవడం లాంటి చర్యల వల్ల ఫలితముంటుంది. 
- ఇంట్లో, బయటా డిడిటి స్ప్రే చేయాలి. 
- వరి పొలంలో ఉండే నీళ్లలో, చెరువుల్లో దోమ లార్వాలను తినే గంబూషియా చేపలు వదలాలని అధికారులను కోరాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు