ఆఫీసులకెళ్లి తూగుతున్నారా? అయితే ఇలా చేయండి

గురువారం, 13 ఏప్రియల్ 2017 (11:18 IST)
రాత్రి పూట నిద్ర కరువైందా..? ఆఫీసులకెళ్లి తూగుతున్నారా? అయితే ఏరోబిక్స్ చేయడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఏరోబిక్స్ చేయడం ద్వారా శరీరంలో నిద్రను కలిగించే ప్రొటీన్లు తగ్గుతాయి. అతిగా నిద్రించే రోగం, హైపర్ సోమ్నియాను తగ్గించుకునేందుకు ఏరోబిక్ ఎక్సర్ సైజులు చేయాలని సూచించారు. నిద్ర నుంచి మెలకువ వచ్చిన తరువాత కూడా లేచేందుకు ఇబ్బంది పడటం, ఆందోళన, చికాకును ప్రదర్శించడం, ఆలోచనలు నెమ్మదిగా సాగడం, నిదానంగా మాట్లాడటం, అతిగా ఆకలి, భ్రాంతులు కలగడం, జ్ఞాపక శక్తి మందగించడం వంటివి హైపర్ సోమ్నియా లక్షణాలని వైద్యులు అంటున్నారు. 
 
అందుకే ఆఫీసుల్లోనూ చాలామందికి నిద్ర ముంచుకొస్తుందని.. అలాంటప్పుడు ఏరోబిక్స్ వ్యాయామం ద్వారా ఈ రోగాన్ని దూరం చేసుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. ఇంకా రాత్రిపూట 8 గంటల నిద్ర అవసరమని.. లేదంటే అనారోగ్య సమస్యలతో పాటు కార్యాలయాల్లో నిద్ర ముంచుకొస్తుందని వారు చెప్తున్నారు. 
 
ఆఫీసుల్లో నిద్ర ముంచుకొస్తే.. ఓ 20 నిమిషాల పాటు చిన్న కునుకు తీసి.. ఆపై ఫ్రెషప్ అయితే మెదడు బాగా పనిచేస్తుందని.. అదే నిద్రను నియంత్రించుకుని కుర్చీలకు అతుక్కుపోతే మాత్రం ఒబిసిటీ తప్పదు. ఇక ఆఫీసుల్లో నిద్రవస్తే ఓ పది నిమిషాల పాటు నడక సాగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి