బెల్లం తయారీలో హైడ్రాన్ (సల్ఫర్), సోడియం కార్బొనేట్, సూపర్ ఫాస్ఫేట్ వంటి రసాయన పదార్థాలను రైతులు విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నట్టు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. నిజానికి బెల్లం రంగు అనేది అక్కడి నేల స్వభావం, సేంద్రియ, రసాయన ఎరువుల వాడకాన్ని బట్టి ఉంటుంది.
అయితే బెల్లం రంగు బాగా ఆకర్షణీయంగా ఉండాలనే ఉద్దేశంతో రైతులు యధేచ్ఛగా రసాయనాలను వాడేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రైతులే అంగీకరించడం గమనార్హం. హైడ్రాన్ కలిసిన బెల్లం తినడం వల్ల దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆస్తమా, జీర్ణ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.