పడకగదిలో కంటినిండా నిద్ర పట్టడం లేదా? అయితే, ఇలా చేయండి!

సోమవారం, 10 ఏప్రియల్ 2017 (15:26 IST)
చాలా మందికి రాత్రి వేళల్లో కంటినిండా నిద్రపోలేరు. దీంతో రోజంతా తీవ్రమైన శరీర బడలికతో అలసిపోయినట్టు కనిపిస్తారు. ఇలాంటి వారు కంటి నిండా నిద్రపోయేందుకు కారణాలను తెలుసుకుని వాటిని సరిచేసుకోవడమే కాకుండా, కొన్ని చిట్కాలను పాటిస్తే... హాయిగా నిద్రపోవచ్చు. 
 
పడకగదిలో ఎక్కువ వెలుతురు ఉండకుండా చూసుకోవాలి. బయటి నుంచి ఎక్కువ వెలుతురు పడుతున్నట్లయితే కర్టెన్స్‌ ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి సమయంలో కడుపునిండా ఆరగించకూడదు. భోజనానికి పడుకోవడానికి మధ్య 2 గంటల సమయం ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు రాత్రివేళ తేలికపాటి ఆహారం తీసుకోవాలి. 
 
పడక గదిలోని మంచంపై బెడ్‌ అనుకూలంగా ఉందో లేదో చూసుకోవాలి. కొందరు టీవీ చూస్తూ అలానే నిద్రపోతారు. టీవీ నడుస్తూనే ఉంటుంది. దానివల్ల మధ్యలో మెలకువ వస్తుంది. అర్థరాత్రి మెలకువ వస్తే మళ్లీ నిద్రపట్టడానికి సమయం పడుతుంది. కాబట్టి టీవీ, లైట్స్‌ అన్నీ ఆఫ్‌ చేశాకే నిద్రకు ఉపక్రమించాలి. 
 
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. గాఢనిద్రకు వ్యాయామం అవసరం. సాయంకాలం గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అప్పుడే నిద్ర బాగా పడుతుంది. నిద్రకు ఖచ్చితమైన వేళలు పాటించాలి. పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చటి పాలు తీసుకున్నా నిద్ర బాగా వస్తుంది. 
 
నిద్రకు ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలి. కుక్కల అరుపులు, వాహనాల శబ్దాలు బెడ్‌రూమ్‌లో వినిపిస్తుంటే నిద్రకు అంతరాయం కలగవచ్చు. మేడపైన ఉండే వారు చేస్తున్న శబ్దాలు, సీలింగ్‌ ఫ్యాన్‌ శబ్దం వల్ల కూడా నిద్రాభంగం కలగవచ్చు. ప్రశాంతమైన నిద్ర కావాలంటే అలాంటి శబ్దాలు దరిచేరకుండా చూసుకోవాలి. 

వెబ్దునియా పై చదవండి