మాస్కులతో కరోనా కట్టడి.. అసలు మాస్కును ఎలా ధరించాలి?

శనివారం, 11 ఏప్రియల్ 2020 (11:33 IST)
తెలంగాణ రాష్ట్రంలో ముఖానికి మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై ఇంటి నుంచి కాలు బయటపెడితే ముఖానికి మాస్కులు ధరించాల్సిందే. అలాగే, రోడ్లపై ఉమ్మి వేయడానికి లేదు. ఈ రెండు నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కేసులు పెట్టి బొక్కలో పడేస్తారు. 
 
కొందరిలో కరోనా లక్షణాలు బయటకు కనిపించనప్పటికీ ఫలితాల్లో వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ జరుగుతోంది. ఇలాంటి వారు మాస్కు లేకుండా బయకు వెళుతుండటంతో ఇతరులకు వైరస్‌ సోకుతోందని ఇటీవల జపాన్‌లో జరిపిన ఓ అధ్యయనంలో తేలిందని ప్రభుత్వం పేర్కొంది. 
 
ఈ కారణంగా వైరస్‌ చాపకింద నీరులా విస్తరించే ప్రమాదం ఉండటంతో  మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రజలంతా మాస్కులను ధరించేలా జిల్లా కలెక్టర్లు ఆరోగ్య శాఖ అధికారులు తగు చర్యల్ని తీసుకోవాలని ఉత్వర్వుల్లో స్పష్టం చేసింది. మాస్కుల ధారణ, తొలగింపు విషయంలో ప్రత్యేకంగా సూచనలు కూడా చేసింది. 
 
అసలు మాస్కులు ఎలా ధరించాలన్న అంశంపై చాలా మందికి సరైన అవగాహన లేదు. ఇదే అంశంపై వైద్యులను సంప్రదిస్తే, 
 
* ముక్కు, మూతిని పూర్తిగా కవర్‌ చేసేలా మాస్కు ధరించాలి. 
* ఉద్యోగస్తులందరూ మాస్కులను ధరించాలి. 
* బయట పనిచేసే ప్రతి వర్కర్‌ తప్పని సరిగా మాస్కులను ఉపయోగించాలి. 
* గ్రామీణ ప్రాంతాల వారు కూడా బయటకు వస్తే తప్పని సరిగ్గా మాస్కులను ధరించాలి. 
* మాస్కులను తొలగించాక చేతులను శానిటైజర్‌ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
* మాస్కును ఒకవైపే వేసుకోవాలి. ఒక్కసారి ఉపయోగించే మాస్కులను ఆరుగంటలకు ఒకసారి కొత్తది వేసుకోవాలి.
* ఉపయోగించిన మాస్కులను ఎక్కడ పడితే అక్కడ వేయరాదు. మూసి ఉన్న చెత్తడబ్బాల్లోనే వేయాలి.
* మాస్కు ధరించినంత తర్వాత కూడా సామాజిక దూరాన్ని పాటించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు