వర్క్ ఫ్రమ్ హోమ్: రిమోట్‌గా పనిచేస్తున్నప్పుడు ఒత్తిడిని అధిగమించడానికి సలహాలు

సోమవారం, 13 సెప్టెంబరు 2021 (19:28 IST)
గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అసాధారణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. దానితో ఎన్నో కంపెనీలు తప్పనిసరై రిమోట్‌ వర్కింగ్‌కు మొగ్గు చూపాయి. ఇప్పటికీ అది కొనసాగుతుంది. ఎక్కడి నుంచైనా పనిచేయడమనేది ప్రతి ఒక్కరికీ పలు రకాలుగా సౌకర్యం కల్పించవచ్చేమో కానీ దీర్ఘకాలం ఇంటి నుంచి పనిచేయడమన్నది మానసిక ఆరోగ్యం పరంగా వినూత్నమైన సవాళ్లను తీసుకురావొచ్చు. సహచర ఉద్యోగులతో సంభాషణలు లోపించడం, సోషలైజింగ్‌ లేకపోవడం వంటివి అధిక ఒత్తిడికి గురిచేయవచ్చు.
 
ఎలాంటి సంభావ్య ప్రమాదాలతో అయినా పోరాడేందుకు శరీర రక్షణ యంత్రాంగంగా ఒత్తిడిని చెబుతుంటారు. తనను తాను రక్షించుకునేందుకు శరీరం చేసే పోరాటమిది. కొన్ని పరిస్థితులలో, దృష్టి కేంద్రీకరించడానికి, శక్తిని చాటడానికి, ఆప్రమత్తతో ఉండటానికి సైతం ఒత్తిడి సహాయపడుతుంది. ఉదాహరణకు కారులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాన్ని ఊహించి బ్రేకులు వేయడం. అయితే ఈ ఒత్తిడి అధికమైతే అనారోగ్యకరమైన పరిస్థితులు ఎదురుకావచ్చు.
 
సామాజిక సంభాషణలు లేకపోవడం చేత రిమోట్‌గా వర్క్‌ చేయడం వల్ల ఒంటరితనం, అసహనం ఎదుర్కోవాల్సి రావొచ్చు. పిల్లలు, ఇతర కమిట్‌మెంట్స్‌ ఉన్న వారికి మరింత సవాల్‌గా ఇది నిలుస్తుంది. కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడిగా మారేంత వరకూ దీనికి గుర్తిచలేకపోవనూ వచ్చు.
 
ఒత్తిడికి సంబంధించి కొన్ని లక్షణాలలో...
చిన్న అంశాలను సైతం గుర్తుంచుకోలేకపోవడం, సరైన నిర్ణయాలను తీసుకోలేకపోవడం, ప్రతి అంశంలోనూ లోపాలపై దృష్టి కేంద్రీకరించడం, ప్రతి అంశానికీ ఆందోళన చెందడం, ఒంటరితనంతో బాధపడటం, లైంగికంగా ఆసక్తి కోల్పోవడం, ఛాతీ, పొట్టలో నొప్పి వంటివి  ఉంటాయి.
 
ఈ లక్షణాలు తరచుగా కనిపించినట్లయితే లేదా సుదీర్ఘంగా, తీవ్రంగా వేధిస్తున్నట్లయితే  తమకున్న ఒత్తిడి నిర్వహించుకోవడానికి ఈ దిగువఅంశాలను అనుసరించడం చేయాలి.
ఉదయం పూట దినచర్య అనుసరించండి: మీ రోజు ప్రారంభంలో ఓ నిర్థిష్టమైన దినచర్య ఆరంభించండి. అది పార్కులో నడవడం, కొన్ని సరళమైన వ్యాయామాలు, వంట చేయడం ఏదైనా కావొచ్చు. మనస్సుకు ప్రశాంతతనందించే ఏ అంశమైనా ఉపయోగమే.
 
రోజు ముగింపునూ గుర్తుంచుకోండి: వర్కింగ్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనగానే గంటల తరబడి సిస్టమ్‌కు అంకితమవుతుంటారు. అయితే ఎప్పుడు వర్క్‌ ఆపాలనేది ముందే నిర్ణయించుకుని రిమైండర్‌ సెట్‌ చేసుకోవాలి. ల్యాప్‌టాప్‌ దూరంగా ఉంచడం, ఫోన్‌ ఆఫ్‌ చేయడం వీటిలో భాగం.
 
లంచ్‌ బ్రేక్‌ నియంత్రణలో ఉండాలి: మీ వర్క్‌కు దూరంగా 40 నిమిషాలు భోజనం చేసేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు వినియోగించుకోవడంతో పాటుగా పవర్‌ న్యాప్‌కు వినియోగించుకుంటే ఉత్సాహంగా తిరిగి పని చేయవచ్చు.
 
ప్రాధాన్యతా జాబితా చేసుకోవాలి: ప్రాధాన్యతా క్రమంలో చేయాల్సిన అంశాల జాబితా తీర్చిదిద్దుకుంటే చివరి నిమిషంలో హడావుడి తగ్గుతుంది.
 
తగినంత నిద్ర అవసరం: అధిక స్ర్కీన్‌ సమయం అంటే అధిక ఒత్తిడి సమయం అని అర్థం. నిద్రకు ఉపక్రమించే ముందు డిజిటల్‌ తెరలకు దూరంగా ఉండాలి. శరీర ఆరోగ్యానికి మెరుగైన నిద్ర అవసరం. మనసుకు తగిన విశ్రాంతి లభించినప్పుడే శరీరమూ తగిన విశ్రాంతి పొందుతుంది.
 
స్నేహితులను కలవండి: మీ స్నేహితులను కలువడానికి సమయం వెచ్చించండి. మీ సంభాషణలలో మీ వర్క్‌ను దరి చేరనీయకండి.
 
ముగింపు
రిమోట్‌వర్కింగ్‌.... అన్ని అంశాలలాగానే మంచిచెడులను కలిగి ఉంటుంది. మహమ్మారితో జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే ఉండాల్సి వస్తుంది. అయితే, ఈ సమయంలో మానసిక ఆరోగ్యం పట్ల అమిత శ్రద్ధ చూపడం అవసరం. మీకు సౌకర్యవంతంగా ఉండి, మీకు ఎల్లవేళలా సహాయం చేసే వారితో మాట్లాడటం వల్ల మీ పరిస్థితి మరింత దిగజారకుండా కాపాడుకోవచ్చు.
 
- మేఘ జైన్‌, క్లినికల్‌ సైకాలజిస్ట్‌, అపోలో స్పెక్ట్రా, హైదరాబాద్‌.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు