బ్రెయిన్‌ ఆపరేషన్ చేస్తుంటే ఆ రోగి ఏం చేశాడో తెలుసా... విస్తుపోయిన వైద్యులు...

గురువారం, 20 జులై 2017 (12:51 IST)
సాధారణంగా ఏ చిన్నపాటి ఆపరేషన్ చేయాలన్నా రోగికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం సహజం. మత్తు లేకుండా ఆపరేషన్ చేయడం చాలా అరుదుగానే జరుగుతుంది. అదే తలకు ఆపరేషన్ చేస్తుంటే ఇంకేమైనా ఉందా. రోగికి పూర్తిగా మత్తుమందు ఇస్తారు. దీంతో రోగి స్పృహలో లేకుండా పోతాడు. కానీ, బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఆపరేషన్ చేస్తున్న సమయంలో గిటార్ వాయిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. 
 
అతనికి మత్తు మందు ఇచ్చారు కానీ ఆపరేషన్ చేయాల్సిన భాగానికి మాత్రమే మత్తు మందు ఇచ్చారు. దీంతో ఒకవైపు వైద్యులు ఆపరేషన్ చేస్తుంటే.. మరోవైపు అతని గిటార్ వాయిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బెంగుళూరుకు చెందిన 32 యేళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గత కొన్ని రోజులుగా న్యూరోలాజికల్ డిజాడర్‌ సమస్యతో బాధపడుతున్నాడు. డాక్టర్లు బ్రెయిన్‌ ఆపరేషన్ చేయాలని సూచించారు. దాదాపు 7 గంటల పాటు ఆపరేషన్ సాగింది. అయితే ఆపరేషన్ సమయంలో అతను గిటార్ వాయించడానికి ఓ కారణమైంది. అతను సంవత్సరం క్రితం గిటార్ వాయిస్తుండగా చేతి కండరాలు పట్టేశాయి.
 
అప్పటినుంచి అతని ఎడమ చేతి మూడు వేళ్లు పనిచేయడం లేదు. దీంతో ఆపరేషన్ చేసే సమయంలో ఆ సమస్యను గుర్తించడానికి.. వేళ్లు పనిచేయకపోవడానికి కారణమేంటో తెలియడానికి అతనిని గిటార్ వాయించమని డాక్టర్లు సూచించారు. అతను అలానే చేశాడు. దీంతో మెదడులో చికిత్స చేయాల్సిన సరైన ప్రాంతాన్ని డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్‌ను విజయవంతం చేశారు.

వెబ్దునియా పై చదవండి